ఢిల్లీపైనే ఎన్సీపీ, కాంగ్రెస్ గురి లోక్‌సభ సీట్లపై లొల్లి | Congress,NCP focus on delhi Lok Sabha seats | Sakshi
Sakshi News home page

ఢిల్లీపైనే ఎన్సీపీ, కాంగ్రెస్ గురి లోక్‌సభ సీట్లపై లొల్లి

Published Fri, Nov 8 2013 2:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress,NCP focus on delhi Lok Sabha seats

 సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో మరోసారి గద్దెనెక్కడానికి కాంగ్రెస్, ఎన్సీపీలు వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ సీట్లను సాధించుకునేందుకు సీనియర్ మంత్రులను రాబోయే లోక్‌సభ ఎన్నికలబరిలో దింపాలని యోచిస్తున్నాయి. అయితే సీనియర్లు మాత్రం లోక్‌సభకు వెళ్లడానికి సుతరామూ ఇష్టపడడం లేదు.
 
 రాహుల్‌ను ప్రధాని చేయడానికి వీలుగా అత్యధిక స్థానాలకు కైవసం చేసుకుని మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్వీళ్లూరుతోంది. ఈ విషయంపై ఇప్పటికే అధిష్టానంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చర్చలు కూడా జరిపారు. ఇక రాష్ట్రంలో బలాబలాను పరిశీలించినట్టయితే గత ఎన్నికల్లో 26 స్థానాల్లో పోటీ చే సిన కాంగ్రెస్ 17 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. విజయం సాధించిన స్థానాలతోపాటు పరాజయం పాలైన లోక్‌సభ  నియోజకవర్గాల్లోనూ సర్వే జరుపుతోంది. అధిక స్థానాలు గెలుచుకునేందుకు సీనియర్ మంత్రులను బరిలోకి దింపితే బాగుంటుందని ముఖ్యమంత్రితోపాటు అధిష్టానమూ భావిస్తోంది.  
 
 ఎన్సీపీ గురి కూడా ఢిల్లీపైనే..
 రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి అత్యధిక స్థానాలకు కైవసం చేసుకునేందుకు ఎన్సీపీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఎన్సీపీకి మహారాష్ట్రలోనే అత్యధిక పట్టుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ కూడా అత్యధిక స్థానాలు కైవ సం చేసుకునేందుకు  కాంగ్రెస్ మాదిరిగానే సీనియర్ నాయకులు, మంత్రులను లోక్‌సభ బరిలోకి దింపాలని భావిస్తోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కూడా సీనియర్ మంత్రులను లోక్‌సభకు పంపిస్తామని ప్రకటించారు.  తమకు అత్యధికంగా పట్టున్న మహారాష్ట్రలో కనీసం 15 లోకసభ స్థానాలను సాధించుకోవాలని ఎన్సీపీ పట్టుదలతో ఉంది.  
 
 రాష్ట్ర రాజకీయాలవైపే సీనియర్ల మొగ్గు..
 కాంగ్రెస్, ఎన్సీపీ తమ సీనియర్ నాయకులు, మంత్రులను లోక్‌సభ బరిలోకి దింపాలని యోచిస్తుండగా, వాళ్లంతా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అధిష్టానాన్ని ఎదిరించే ధైర్యం చేయడం లేదు. నాగపూర్ ఎంపీ, బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి గట్టి పోటీ ఇచ్చేందుకుగా ఆర్థిక , జలవనరుల సహాయక మంత్రి రాజేంద్ర ములూక్‌ను బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గడ్కరీకి ప్రస్తుత ఎంపీ విలాస్ ముత్తెంవార్ కంటే రాజేంద్ర ములూక్ గట్టిపోటీ ఇవ్వగలడని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. ములూక్ మాత్రం లోక్‌సభకు పోటీ చేసేందుకు ఇష్టపడడంలేదు.  
 
 మాకొద్దు లోక్‌సభ సీట్లు..
 చంద్రపూర్ లోక్‌సభస్థానం నుంచి పర్యావరణ, సాంస్కృతిక శాఖ మంత్రి సంజయ్ దేవతలేను బరిలోకి దింపాలన్న ప్రతిపాదన ఉంది. మాజీ ఎంపీ నరేష్ పుంగలియ ఇక్కడ వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా దేవతలేను తెరపైకి తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.  దేవతలేకు మాత్రం లోక్‌సభకు పోటీ చేయడం ఇష్టంలేదు. పార్టీ ఆదేశాలను పాటిస్తానని అయిష్టంగానే చెబుతున్నట్టు తెలిసింది. ఇక కొల్హాపూర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీంతో ఇక్కడి నుంచి హోంశాఖ సహాయమంత్రి సతేజ్ ఎలియాస్ బంటి పాటిల్‌ను బరిలోకి దింపే అవకాశముంది. ఆయన కూడా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాలని, లోక్‌సభకు వెళ్లకూడదని అనుకుంటున్నారు.
 
 ఎన్సీపీలోనూ ఇదే పరిస్థితి...
 కేంద్రంలో పార్టీని బలోపితం చేసేందుకు సీనియర్ నాయకులు, మంత్రులను బరిలోకి దింపాలని ఎన్సీపీ కూడా యోచిస్తోంది. కాంగ్రెస్ మంత్రుల మాదిరిగానే ఎన్సీపీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా లోక్‌సభకు పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు, ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌ను నాసిక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తోంది. భుజ్‌బల్ పేరు దాదాపు ఖాయమేనని భావిస్తున్నారు. అయితే మంత్రి మాత్రం ముంబైలోనే ఉండాలని కోరుకుంటున్నారు. హత్‌కణంగలే నుంచి గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జయంత్ పాటిల్, మావల్ నియోజకవర్గం నుంచి సునీల్ తట్కరేను బరిలోకి దింపనున్నట్టు ఎన్సీపీ నుంచి సంకేతాలు వచ్చాయి. అయితే హతకణంగలే లోక్‌సభ నుంచి పోటీని తప్పించుకునేందుకు జయంత్ పాటిల్ ఈ స్థానాన్ని కాంగ్రెస్ కోటాలోకి నెట్టేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అంటే ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. తాజా విస్తరణలో కొందరు యువనాయకులకు అవకాశం కల్పించినా, వీరిలోనూ పలువురిని లోక్‌సభకు పోటీ చేయించాలని ఎన్సీపీ అనుకుంటోంది. నీటివనరుల శాఖ (కృష్ణవ్యాలీ) మంత్రి రామ్‌రాజ్ నింబాల్కర్, రెవెన్యూ శాఖ సహాయక మంత్రి ప్రకాశ్ సోలంకేను మంత్రి మండలి నుంచి తప్పించినప్పటికీ వారిని లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది. నింబాల్కర్‌ను షోలాపూర్ జిల్లా మాఢా లోక్‌సభ నియోజకవర్గం నుంచి, సోలంకేను బీడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే అవకాశముంది. మాఢా స్థానం నుంచి గతంలో స్వయానా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పోటీ చేసి గెలిచారు. మరోవైపు బీడ్ ఎంపీగా బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే వ్యవహరిస్తున్నారు.
 
 బీడ్ నుంచి ప్రకాశ్ సోలంకే ముండేకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. మరోవైపు సతారా ఎంపీ ఉదయ్‌రాజ్ భోస్లే శివసేన, బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే భోస్లేకు పోటీగా సతారా ఎమ్మెల్యే, ఎన్సీపీ యువనాయకుడు శశికాంత్ షిండేను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపడానికి ఎన్సీపీ ప్రయత్నిస్తోంది. షిండే స్థానికంగా మరింత పట్టు పెంచుకొని బలోపేతం కావడానికి మంత్రి మండలిలో స్థానం కల్పించారని చెప్పవచ్చు. పార్టీ అధిష్టానం కేంద్రంలో అధికారాన్ని దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతుండగా రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు మాత్రం తమ రాజకీయ భవితవ్యంపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. లోక్‌సభకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని వారు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement