'ఎంసీఏ చరిత్రలో నాదే బెస్ట్ స్కోర్'
ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తనపై చేసిన విమర్శలకు ఎన్సీపీ అధ్యక్షుడు, ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) అధ్యక్షుడు శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. ఎంసీఏ చరిత్రలో తాను బెస్ట్ స్కోరు చేశానని చెప్పారు.
'అభివృద్ధి కోణంలో చూస్తే వాంఖేడ్ మైదానం నిర్మించి దివంగత ఎస్ కే వాంఖేడ్ మొదటి సెంచరీ సాధించారు. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక బాంద్రా కర్లా ఇండోర్ అకాడమీ ఏర్పాటు చేశాం. ఇదే రకమైన సౌకర్యాలు కాందవలి,ధానేల్లో కల్పించాం. దీన్నిబట్టి చూస్తే నేను మూడు సెంచరీలు సాధించినట్టు లెక్క. ఇదీ మా స్కోరు' అని శరద్ పవార్ అన్నారు.
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటర్లు రిటైరయ్యారు కానీ శరద్ పవార్ మాత్రం ఎంసీఏను వీడలేదని ఉద్ధవ్ థాకరే ఎద్దేవా చేశారు. జీరో స్కోరు చేసినా పవార్ ఇప్పటికీ ప్యాడ్లు కట్టుకుని ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 14 ఏళ్లుగా ఎంసీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పవార్ మరోసారి పోటీకి రెడీ అవుతున్న నేపథ్యంలో థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు.