‘‘నేను ముంబైలోని చాలా చోట్ల తలదాచుకున్నాను. ఎక్కడెక్కడో తిరిగాను. ఎప్పుడైతే నేను ఐపీఎల్‌కు సెలక్ట్ అయ్యానో.. అప్పుడు నా మనసులో మెదిలిన ఒకే ఒక ఆలోచన ఏమిటంటే.. ముంబైలో మాకంటూ ఇల్లు కొనుక్కోవడం. నా తల్లిదండ్రులు, తోబుట్టువులను ఇక్కడకు తీసుకువచ్చి వారితో పాటు కలిసి ఉండాలి.
ఇంతకంటే నాకు పెద్ద కోరికలేమీ లేవు. వాళ్లకు కావాల్సిన అవసరాలు తీర్చడం.. ఇంటిని చక్కబెట్టుకోవడం అంతే! అంతకంటే ముఖ్యంగా నా ఆటపై దృష్టి సారించడం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అన్నాడు.
సెంచరీతో చెలరేగి
కాగా ఐపీఎల్ 2020 ఎడిషన్ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ యశస్విని 2.40 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ మెగా వేలం 2022కు ముందు ఏకంగా 4 కోట్లు వెచ్చించి అతడిని రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రాజస్తాన్ కీలక ఆటగాడిగా మారిన యశస్వి తాజా సీజన్‌లోనూ అదరగొట్టాడు.
ఐపీఎల్-2023లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 14 మ్యాచ్‌లు ఆడి 625 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు యశస్వి.
ఆ చేదు జ్ఞాపకాలను నేను చెరిపేయలేను
ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముంబై బ్యాటర్ మాట్లాడుతూ తన జీవితంలోని ఎత్తుపల్లాల గురించి చెప్పుకొచ్చాడు. ‘‘జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. నాకన్నీ అలవాటే.
నిజానికి నా గతం కారణంగానే.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలను నేను చెరిపెయ్యలేను. ఎవరైనా నా గతం గురించి అడిగితే చెప్పడానికి అస్సలు సిగ్గుపడను.
ఇప్పటి వరకు సాగిన నా ఈ ప్రయాణం గురించి చెప్పడంలో నాకెలాంటి అభ్యంతరాలు లేవు. నా జీవితం కొందరికైనా స్ఫూర్తినిస్తే నాకంతే చాలు. త్వరలోనే ఔత్సాహిక క్రికెటర్ల కోసం ఓ ఫౌండేషన్ మొదలుపెట్టాలనుకుంటున్నాను.
నేను లక్కీ.. కానీ
చాలా మందికి ప్రతిభ ఉండి కూడా ఆర్థిక తోడ్పాటు లేక వెనుకబడి పోతున్నారు. అలాంటి వారికి మా ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తాం. నాకైతే లక్కీగా ముంబై క్రికెట్ అసోసియేషన్ రూపంలో నా నైపుణ్యాలు, ఫిట్‌నెస్ మెరుగుపరచుకునే వేదిక దొరికింది.
అందరి విషయంలో ఇలా జరుగదు కాబట్టి నాలాంటి వాళ్లకు అండగా నిలబడాలని భావిస్తున్నా’’ అని 21 ఏళ్ల యశస్వి జైశ్వాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లో సాధారణ కుటుంబంలో జన్మించిన యశస్వి.. పదేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు.
ఆజాద్ మైదాన్‌లో ట్రెయినింగ్ చేస్తూ డైరీ షాపులో పనిచేశాడు. పానీపూరీ అమ్మేవాళ్లకు సాయం చేస్తూ జీవనాధారం పొందేవాడు. ఈ క్రమంలో క్రికెట్ కోచ్ జ్వాలా సింగ్ అతడిని చేరదీశాడు. లీగల్ గార్డియన్‌గా మారి యశస్వి నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి పునాదులు వేశారు.
వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ.
చదవండి: ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ..
Comments
Please login to add a commentAdd a comment