పృథ్వీ షా
ఒక 20 ఏళ్ల యువ క్రికెటర్ 15 నెలల వ్యవధిలోనే ఉవ్వెత్తున ఎగసి ఉస్సురని కూలిపడ్డాడు... గత కొద్ది నెలలుగా పరిణామాలు చూస్తే పృథ్వీ షాకు బీసీసీఐ నుంచి గానీ ముంబై క్రికెట్ సంఘం నుంచి గానీ సరైన మార్గనిర్దేశనం లభించలేదని అర్థమవుతోంది. అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేయాల్సిన కుర్రాడి కెరీర్‌పై అప్పుడే సందేహాలు రావడం దురదృష్టకరం.
సాక్షి క్రీడా విభాగం
ఆస్ట్రేలియన్ మీడియా సచిన్‌తో పోలుస్తూ రాసిన వ్యాసాల మధ్య పృథ్వీ షా 2018 నవంబరులో ఉత్సాహంగా ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. సిడ్నీలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చూడచక్కటి షాట్లతో అర్ధ సెంచరీ కూడా చేశాడు. అయితే అదే మ్యాచ్‌లో వచ్చిన ఉపద్రవం అతడిని ఇబ్బందుల్లో పడేసింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో షా అనూహ్యంగా గాయపడ్డాడు. బౌండరీ వద్ద క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని కాలి మడమకు దెబ్బ తగిలింది. ఆ ఘటన తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించగలదని అతనూ ఊహించకపోవచ్చు! ముందుగా ఒక టెస్టుకే దూరమని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించినా... చివరకు సిరీస్ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు. తాజాగా రంజీ ట్రోఫీ ప్రదర్శనతో న్యూజిలాండ్‌తో సిరీస్‌పై ఆశలు పెరిగినా... మరో గాయం మళ్లీ అతడిని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి పంపించింది.
ఆరంభం అదిరేలా...
స్కూల్ క్రికెట్‌లో సంచలనాల తర్వాత సీనియర్ స్థాయిలో నిలకడైన ప్రదర్శన పృథ్వీ షాకు ముంబై క్రికెట్‌లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఫలితంగా 17 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీ ఆడే అవకాశం దక్కింది. తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించడంతో పాటు దులీప్ ట్రోఫీలో కూడా పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును సవరించడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగినట్లుగానే భారత ‘ఎ’ జట్టు తరఫున కూడా ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు అతను ఎంపికయ్యాడు.
అక్కడ మ్యాచ్ ఆడకపోయినా... స్వదేశం రాగానే వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులోనే పృథ్వీ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత జరిగిన హైదరాబాద్ టెస్టులోనూ అతను అర్ధ సెంచరీ చేశాడు. ఇక దూసుకుపోవడమే తరువాయి అన్న సమయంలో గాయం వెతుక్కుంటూ వచి్చంది. కోలుకున్నాక ముస్తాక్ అలీ ట్రోఫీలో, ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఆడటంతో షా కెరీర్ మళ్లీ దారిలోకి వచ్చినట్లు అనిపించింది. అయితే మళ్లీ గాయపడటంతో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన వన్డే సిరీస్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. నిజానికి ఈ గాయం గురించి బోర్డు స్పష్టత ఇవ్వలేదు.
దగ్గు తెచ్చిన తంటా...
ఇన్నేళ్లలో భారత క్రికెట్‌లో పెద్దగా వినిపించని వివాదంతో పృథ్వీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో బీసీసీఐ అతనిపై 9 నెలల నిషేధం విధించింది. షా ‘టర్బుటలిన్’ అనే నిషేధిత ఉత్రే్పరకం వాడినట్లు తేలింది. అయితే తాను దగ్గుతో బాధపడుతుండటంతో తీసుకున్న సిరప్ వల్లే ఈ సమస్య వచి్చందని ఈ యువ బ్యాట్స్‌మన్ వివరణ ఇచ్చుకున్నాడు. నిజానికి ప్రతీ ఆటగాడికి బీసీసీఐ నిషేధిత డ్రగ్స్ జాబితా ఒకటి ఇస్తుంది. వారు వాడే ఎలాంటి మందులోనైనా ఇవి ఉన్నాయో, లేవో చూసుకోవాలి.
సీనియర్ టీమ్‌కు ఆడిన ఒక క్రికెటర్ బోర్డు వైద్య బృందంలో ఎవరినీ సంప్రదించకుండా, సలహా తీసుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా దగ్గు మందు వాడటం నిజంగా ఆశ్చర్యకరం. ఇక్కడే అతనికి ఎవరూ సరైన సూచనలు ఇవ్వలేదని అర్థమవుతోంది. అదృష్టవశాత్తూ పృథ్వీపై నిషేధాన్ని పాత తేదీ నుంచి వర్తింపజేయడంతో గత ఏడాది నవంబర్ 16 నుంచి ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులోకి వచ్చాడు.
అవకాశం ఉందా!
పృథ్వీ గాయంతో జట్టులోకి వచి్చన మయాంక్ అగర్వాల్ మెల్‌బోర్న్‌లో తొలి టెస్టులోనే చెలరేగగా, ఆ తర్వాత కూడా చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడి తన స్థానం ఖాయం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి రోహిత్ శర్మకు మరో ఓపెనర్ స్థానం ఖరారైంది. రిజర్వ్ ఓపెనర్‌గా రాహుల్ అందుబాటులో ఉండగా... అవసరమైతే ఇప్పటికే జట్టుతో ఉంటున్న శుబ్‌మన్ గిల్‌కు అవకాశం దక్కుతుంది. ఈ జాబితాలో పృథ్వీ వెనక్కి వెళ్లిపోయాడు. భారత్ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌లో బాగా ఆడి ఉంటే ఏమైనా చాన్స్ ఉండేదేమో కానీ ఇప్పుడు భుజం గాయంతో కనీసం నాలుగు వారాలు క్రికెట్ ఆడే అవకాశమే లేదు. ఈ నెల 12నే న్యూజిలాండ్ టూర్‌కు జట్టు ఎంపిక ఉంది కాబట్టి ఎలాంటి ఆశలు లేవు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని దేశవాళీలో చెలరేగినా మళ్లీ భారత జట్టులోకి రావడం అంత సులువు కాదు.
కొత్త వివాదాలు...
20 ఏళ్ల కుర్రాడంటే సరదాలు, షికార్లు చేస్తాడు, అందులో తప్పేముంది! బయటి నుంచి చూస్తే ఇది మామూలుగానే అనిపించవచ్చు. కానీ భారత్ తరఫున ఆడే స్థాయికి ఎదిగిన ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ఎక్కడ క్రమశిక్షణ తప్పినా అది పెద్ద తప్పు చేసినట్లే. చిన్న వయసులోనే వచి్చన పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఇప్పుడు పృథీ్వని కూడా తప్పు దారి పట్టిస్తున్నాయనేది క్రికెట్ వర్గాల్లో సాగుతున్న చర్చ. వడోదరలో ఇటీవల బరోడాతో మ్యాచ్ సందర్భంగా అతని ప్రవర్తనపై వార్తలు వచ్చాయి. తన హోటల్ గదిలో షా చేసిన ‘రచ్చ’పై ఆగ్రహంతో స్వయంగా ముంబై టీమ్ మేనేజర్ ఫిర్యాదు చేయాల్సి వచి్చందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అపార ప్రతిభ ఉండీ తప్పుడు ప్రవర్తనతో అవకాశాలు కాలదన్నుకున్న వినోద్ కాంబ్లీతో ఇప్పుడు పృథీ్వని వారు పోల్చుతున్నారు.
సచిన్ ఉజ్వల ఘనతలకు అతని ఆటతో పాటు క్రమశిక్షణ కూడా కారణమనే విషయాన్ని ఈ యువ ముంబైకర్‌కు గుర్తు చేయాల్సి ఉంది. ‘పృథ్వీ ప్రవర్తన ఇలాగే కొనసాగితే అతనికే నష్టం. అతనికి లభించిన అవకాశాలను మైదానం బయటి వ్యవహారాలతో చేజార్చుకుంటే అది స్వయంకృతమే అవుతుంది. బరోడా ఘటన ఒక్కటే కాదు. అతని గురించి చెప్పాలంటే చాలానే జరిగాయి. అతని ప్రస్తుత జీవనశైలి అన్ని సమస్యలకు కారణం’ అంటూ ముంబై క్రికెట్ సంఘం కీలక సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. పృథ్వీ షా కెరీర్ ఎదుగుదలలో అతని తండ్రి పంకజ్ షా పాత్ర ఎంతో ఉంది. తల్లి లేని పృథీ్వకి అన్నీ తానై క్రికెటర్‌గా ఎదిగేలా తండ్రి ఎంతో శ్రమించాడు. 14 ఏళ్ల వయసులో స్కూల్ క్రికెట్‌లో 330 బంతుల్లో 546 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పడంతో పృథ్వీ పేరు మార్మోగిపోయింది.
ఈ కుర్రాడు భారత్‌కు ఆడతాడు అంటూ అప్పట్లోనే స్వయంగా సచిన్ అతని ఆటను ప్రశంసించాడు. ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడకుండా పృథ్వీ దూసుకుపోయాడు. నిజానికి సరైన దిశలో వెళ్లడంలో అన్నీ చోట్లా తండ్రి పంకజ్ వెనకుండి నడిపించాడు. అయితే ఇటీవల పరిణామాల అనంతరం సన్నిహితుడొకరు ‘ఈ వయసు కుర్రాళ్లలో ఎందరు తండ్రి మాట వింటారు? ఇప్పుడు అదే జరుగుతోంది. క్రికెట్ కారణంగా ఎక్కువ సమయం పృథ్వీ తన తండ్రికి దూరంగానే ఉంటున్నాడు. ఫలితంగా బయటి స్నేహాలు సమస్యగా మారాయి. దాంతో పంకజ్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు’ అని అభిప్రాయపడ్డాడు. అయితే చిన్న వయసే కాబట్టి ఇప్పటికీ సరిదిద్దుకునే అవకాశం ఉందనేది వారి సూచన.
►సరిగ్గా రెండేళ్ల క్రితం అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు కెపె్టన్ అతను... కొన్నాళ్లకే ఢిల్లీ జట్టు తరఫున భారీ మొత్తానికి ఐపీఎల్‌లో అవకాశం... ఆ తర్వాత కొద్ది రోజులకే భారత సీనియర్ టెస్టు జట్టులో స్థానం, ఆపై ఓపెనర్‌గా తొలి టెస్టులోనే సెంచరీ... సచిన్ తర్వాత అతి పిన్న వయసులో శతకం బాదిన భారత క్రికెటర్‌గా గుర్తింపు... నెలల వ్యవధిలోనే పృథ్వీ షా పైపైకి దూసుకుపోయిన తీరిది.
►కెరీర్‌ను ఉచ్ఛ స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉన్న ఆస్ట్రేలియా సిరీస్‌కు వెళ్లి కాలి గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనుదిరగడం... డోపింగ్‌తో నిషేధానికి గురై ఆటకు దూరం కావడం... పునరాగమనం తర్వాత మళ్లీ వెంటాడుతున్న గాయాలు... దీనికి తోడు క్రమశిక్షణా రాహిత్యం... ఇప్పుడు అతను టీమిండియా ఓపెనర్ స్థానానికి కనీసం పోటీపడే స్థితిలో కూడా కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment