శరద్‌పవార్ కీలక నిర్ణయం
- ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు గుడ్‌బై
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ (76) ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. క్రికెట్ సమూల ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీసీసీఐలో, దాని అనుబంధ యూనిట్లలోని బాధ్యులు, అధికారులకు వయస్సు పరిమితి, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారసు అమలైతే.. శరద్ పవార్‌పై వేటు పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్వచ్ఛందంగా తప్పుకొన్నట్టు భావిస్తున్నారు.
రాజకీయాలతోపాటు క్రికెట్ అనుబంధం కొనసాగిస్తున్న పవార్ 2005 నుంచి 2008 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2010-12 వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2015 జూన్‌లో ఎంసీఏ అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికయ్యారు. అయితే, 70 ఏళ్లు దాటిన వాళ్లు క్రికెట్ సంఘాల్లో ఉండరాదని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.