ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 సీజన్‌కు సంబంధించి ముంబై జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక రాష్ట్ర అసోసియేషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.
డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి ప్రతిభ కనబరుస్తూ కూడా జాతీయ జట్టుకు లేదా ఐపీఎల్‌లో అవకాశాలు రాని ఆటగాళ్లకు ఉపయోగపడేలా కాంట్రాక్టులు అమలు చేయనున్నట్లు గతంలోనే ఎంసీఏ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. తాజాగా ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు అందించడంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ అడుగు ముందుకు వేసింది.
నివేదిక ప్రకారం ముంబై క్రికెట్ అసోసియేషన్ జట్టులోని ఆటగాళ్లను మూడు కేటగిరీలు (గ్రేడ్-ఏ, గ్రేడ్-బి, గ్రేడ్-సి) గా విభజించనుంది. గ్రేడ్-ఏ కేటగిరీ జాబితాలో ఉండే ఆటగాళ్లు రూ. 12 లక్షల నుంచి 20 లక్షలు అందుకోనున్నారు. గ్రేడ్-బి కేటగిరి కింద ఆటగాళ్లు రూ. 8 నుంచి 12 లక్షల వరకు, గ్రేడ్-సిలో ఉండే ఆటగాళ్లు రూ. 8 లక్షలు వార్షిక ఫీజుగా అందుకోనున్నారు.
ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ.. ‘ఎంసీఏ ముందే హామీ ఇచ్చినట్లుగా ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్‌ను అమల్లోకి తీసుకురానున్నాం. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై చాలా ఆలోచించాము. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడే ఆటగాళ్లందరికీ ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాదు. అందుకే ముంబై తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్‌ను అందివ్వాలని నిర్ణయించాం. ఇది ఆటగాళ్లకు ఆర్థికంగానూ ఉపయోగపడనుంది’ అని చెప్పుకొచ్చారు.
నిబంధనలు..
అయితే ముంబై క్రికెట్ అసోసియేషన్ అమలు చేయనున్న వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో ఆటగాళ్లు చోటు దక్కించుకోవడంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ఆటగాళ్లు తప్పనిసరిగా ఎంసీఏలో రిజిస్టర్ అయి ఉండాలి. ఫిట్‌నెస్ ప్రమాణాలు తప్పనిసరి.
గత రెండు సీజన్లలో ఐపీఎల్‌లో పాల్గొనడం లేదా భారత జట్టుకు ఆడిన వారికి ఎంసీఏ కాంట్రాక్టులో చోటు ఉండదు. ఆటగాళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముందు సెలెక్షన్ కమిటీ వారిని సిఫార్సు చేయడానికి అవకాశముంది.
రంజీ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. రంజీ మ్యాచ్ ఆడే ఆటగాళ్లకు రోజుకు రూ. 40 వేల నుంచి 60 వేలు చొప్పున బోర్డు చెల్లిస్తుంది. తాజాగా ఎంసీఏ కూడా అంతే మొత్తం ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ముంబై ఆటగాళ్లు తాము ఆడే ప్రతీ రంజీ మ్యాచ్‌కు బీసీసీఐతో పాటు ఎంసీఏ పారితోషికం కూడా అందుకోనున్నారు. తాజాగా తీసుకొచ్చిన కాంట్రాక్టు విధానం ఆటగాళ్ల కష్టానికి లభించిన ప్రతిఫలం అని చెప్పొచ్చు.


