ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ మళ్లీ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష పదవికి ఆయన ఎన్నిక ఖరారైంది.
ముంబై: ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ మళ్లీ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష పదవికి ఆయన ఎన్నిక ఖరారైంది. పవార్ ప్రత్యర్థి, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే నామినేషన్‌తో పాటు ఆయన చేసుకున్న అప్పీలు కూడా తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నూతన కార్యవర్గం ఎన్నికలు జరుగనున్నప్పటికీ మిగతా పదవులపైనే పోటీ ఉంటుంది.
పవార్ ఒక్కరి నామినేషనే ఉండటంతో అధ్యక్ష పదవికి ప్రకటనే మిగిలుంది. గతంలో పవార్ 2001 నుంచి 2011 వరకు దశాబ్దంపాటు ఎంసీఏ పీఠంపై కొనసాగారు. ఎంసీఏ నిబంధనల ప్రకారం కేవలం ముంబై వాసి మాత్రమే సంఘం ఎన్నికలకు అర్హులు. కానీ ముండే నివాస ధృవీకరణ పత్రం విషయమై స్పష్టత కొరవడటంతో ఎన్నికల అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. తన అభ్యర్థిత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే తోసిపుచ్చారని గోపీనాథ్ ముండే ఆరోపించారు. దీనిపై కోర్టుకెక్కుతానని ఆయన వెల్లడించారు.