జాకీర్‌ హుస్సేన్‌ ఆరోగ్యం విషమం | Tabla maestro Ustad Zakir Hussain in US hospital ICU | Sakshi
Sakshi News home page

జాకీర్‌ హుస్సేన్‌ ఆరోగ్యం విషమం

Published Mon, Dec 16 2024 4:19 AM | Last Updated on Mon, Dec 16 2024 4:19 AM

Tabla maestro Ustad Zakir Hussain in US hospital ICU

కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యం విషమించడంతో ఐసీయూలో చేరిక 

చికిత్స పొందుతూ మరణించినట్టు వార్తలు 

ధ్రువీకరించని కుటుంబ సభ్యులు 

న్యూఢిల్లీ: ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్‌ గ్రహీత జాకీర్‌ హుస్సేన్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. 73 ఏళ్ల హుస్సేన్‌ ఆరోగ్య పరిస్థితి కొద్ది రోజులుగా బాగా విషమించింది. దాంతో రెండు వారాల క్రితం అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారు. 

ఐసీయూలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించినట్టు వార్తలొచ్చాయి. జాకీర్‌ హుస్సేన్‌ సన్నిహితుడు, ప్రముఖ వేణువాద కళాకారుడు రాకేశ్‌ చౌరాసియా కూడా తొలుత దాన్ని ధ్రువీకరించారు. కాసేపటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘దేశం సంగీత ధ్రువతారను కోల్పోయింది. సంగీత ప్రపంచానికి ఆయన సేవలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

 విపక్ష నేత రాహుల్‌ గాం«దీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ తదితరులు సంతాపం తెలిపారు. కానీ జాకీర్‌ హుస్సేన్‌ మృతి వార్తలను ఆయన సోదరి ఖుర్షీద్‌ ఖండించారు. ‘‘నా సోదరుని పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్న మాట నిజమే. కానీ ప్రస్తుతానికి ఆయన ప్రాణాలతోనే ఉన్నారు’’ అని తెలిపారు. 

‘‘జాకీర్‌ హుస్సేన్‌ మరణించారంటూ మీడియాలో, సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న వార్తలు మమ్మల్నెంతో బాధిస్తున్నాయి. వాటిని నమ్మొద్దని మీడియాకు, ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కోలుకోవాలని అంతా ప్రారి్థంచాల్సిందిగా కోరుతున్నాం’’ అని పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. జాకీర్‌ హుస్సేన్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు మార్చినట్టు ఆయన మేనేజర్‌ నిర్మలా బచానీ కూడా పేర్కొన్నారు. కాసేపటికే ఐ అండ్‌ బీ శాఖ కూడా ఎక్స్‌లో చేసిన సంతాప పోస్ట్‌ను తొలగించింది. 

బహుముఖ ప్రజ్ఞాశాలి: బహుముఖ సంగీత ప్రజ్ఞకు జాకీర్‌ హుస్సేన్‌ నిలువెత్తు నిదర్శనం. హిందూస్తానీ క్లాసికల్‌ మ్యూజిక్‌తో పాటు జాజ్‌ ఫ్యూజన్‌లోనూ తిరుగులేని నైపుణ్యం సాధించారు. గ్రేటెస్ట్‌ తబలా ప్లేయర్స్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌లో ఒకరిగా నిలిచారు. సంగీత దర్శకునిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇన్‌ కస్టడీ, ద మిస్టిక్‌ మాసా వంటి సినిమాలకు సంగీతం అందించారు. పలు సినిమాల్లో నటించారు కూడా. ఆయన ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ అల్లా రఖా ఖాన్‌ కుమారుడు. 

1951 మార్చి 9న ముంబైలో జని్మంచిన ఆయన అసలు పేరు జాకీర్‌ హుస్సేన్‌ అల్లారఖా ఖురేషి. తండ్రి బాటలో నడుస్తూ ఏడేళ్ల చిరుప్రాయంలోనే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారు. గొప్ప కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు గడించారు. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. జాకిర్‌ హుస్సేన్‌ అందుకున్న జాతీయ, అంతర్జాతీయ బహుమతులకు, పురస్కారాలకూ లెక్కే లేదు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. పదేళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement