పండిత అనురాధా పాల్‌.. తబలా మాంత్రికురాలు | Tabla Maestro Pandit Anuradha Pal | Sakshi
Sakshi News home page

Pandit Anuradha Pal: పండిత అనురాధా పాల్‌.. తబలా మాంత్రికురాలు

Published Wed, Jan 5 2022 4:31 PM | Last Updated on Wed, Jan 5 2022 4:39 PM

Tabla Maestro Pandit Anuradha Pal - Sakshi

ఉస్తాద్‌ అల్లారఖా పెద్ద తబలా మాస్టర్‌. ఉస్తాద్‌ జాకిర్‌ హుసేన్‌ కూడా. శంకర్‌ ఘోష్, ఉదయ్‌ మజుందార్‌... ఎందరో పురుష ఉస్తాద్‌లు.. పండిత్‌లు. కాని వీరితో సరిసాటిగా కాదు కాదు తనే ఒక విలక్షణ మాస్టర్‌గా అనురాధా పాల్‌ తబలా వాదనలో ఖ్యాతి గడించింది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం సామాన్యం కాదు. ఎన్నో అడ్డంకులను అపధ్వనులను దాటి ఆమె ఈ స్థితికి చేరుకుంది. ఆమె పరిచయం...

ముంబైలో అనురాధా పాల్‌ తబలా కచ్చేరీ జరుగుతోంది. దానికి హాజరైన చిత్రకారుడు ఎం.ఎఫ్‌.హుసేన్‌ ఆసాంతం ఆ కచ్చేరి చూసి, ఆమెను కలిసి, ‘రేపు మీ ఇంటికి వస్తున్నాను’ అని వెళ్లిపోయాడు. ఎందుకు వస్తున్నట్టు? మరుసటి రోజు హుసేన్‌ ఆమె ఇంటికి వచ్చాడు. ఆయనతోపాటు రఫ్‌ కట్‌ చేసిన ‘గజ్‌గామిని’ సినిమా ఉంది. మాధురి దీక్షిత్‌తో ఎం.ఎఫ్‌.హుసేన్‌ తీసిన సినిమా అది. త్వరలో విడుదల కావాల్సి ఉంది.

‘దీనికి నువ్వు నేపథ్య సంగీతం అందించాలి’ అన్నాడు హుసేన్‌. అనురాధా పాల్‌ ఆశ్చర్యపోయింది. ‘నేను బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వడం ఏమిటి? మీరు తలుచుకుంటే ప్రపంచంలోని మహా మహా సంగీతకారులు ఎవరైనా ఇస్తారు’ అని అనురాధా పాల్‌ అంది. ‘కాదు నువ్వు ఇవ్వాలి. సినిమా అంతా నీ తబలా వినిపిస్తే చాలు’ అని మీటింగ్‌ ముగించాడు ఎం.ఎఫ్‌.హుసేన్‌.

అనురాధా పాల్‌ తాను ఒక్కతే తబలా వాయిస్తూ ‘గజ్‌గామిని’కి రీ రికార్డింగ్‌ చేసింది. బహుశా ప్రపంచంలో కేవలం తబలా మీద అదీ ఒక స్త్రీ వాయిద్యకారిణి వాయిస్తూ ఉంటే రీ రికార్డింగ్‌ ముగించుకున్న సినిమా అదొక్కటే ఏమో. అది అనురాధా పాల్‌ ఘనత. ప్రపంచలోనే ఆమె తొలి మహిళా తబలా వాయిద్య కారిణి.



అనురాధా పాల్‌ది ముంబై. అక్కడే పుట్టి పెరిగింది. వాళ్ల కుటుంబం తాతగారి హయాంలో దేశ విభజన సమయంలో ముంబై వచ్చేసింది. ఆమె తండ్రి దేవిందర్‌ పాల్‌ వీధి దీపాల కింద చదువుకుని పెద్ద ఫార్మా కన్సల్టెంట్‌ అయ్యాడు. తల్లి ఇళా పాల్‌ గాయని, పెయింటర్‌. ఆ ఇంట్లో కళల పట్ల ఆసక్తి ఉండేది. పిల్లలు ఏదో ఒక కళలో కనీస అభిరుచి కలిగి ఉండాలని తల్లిదండ్రులు కోరుకునేవారు. అయితే చదువు తప్పనిసరి. కాని ఇంటి చిన్న కుమార్తె అయిన అనురాధా పాల్‌కు చదువు కంటే కళ మీదే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. ఆమె ముందు గాత్రం నేర్చుకుంది.

కాని గాత్రం కొనసాగిస్తూ ఉంటే తోడు వాయిద్యం అయిన తబలా ఆమెను ఆకర్షించింది. పాడుతూనే తబలా మీద కొట్టవలసిన తాళాన్ని అందించేది. తబలా ఎందుకు నేర్చుకోకూడదు? అని ఆమెకు అనిపించింది. ఆడపిల్లలు సితార్, వీణ, వయొలిన్‌ వంటి వాయిద్యాలు నేర్చుకుంటారు. కాని తబలా పూర్తిగా మగవాళ్ల విద్యగా చలామణిలో ఉంది. అలాంటి విద్యను ఆడపిల్ల నేర్చుకోవడమా? కాని తొమ్మిదో ఏటకే అనురాధా పాల్‌ తబలాలో ప్రావీణ్యం సంపాదించింది. కచ్చేరి ఇచ్చింది కూడా.



అనురాధా పాల్‌ మొదట బెనారస్‌ ఘరానాలోని గురువుల దగ్గర తబలా నేర్చుకున్నా చివరకు ఉస్తాద్‌ అల్లారఖా ఆ తర్వాత ఉస్తాద్‌ జాకిర్‌ హుసేన్‌ శిష్యురాలైంది. 18 ఏళ్లకు ఆమె ముంబైలో కచ్చేరి ఇస్తే పత్రికలు ఆమెకు ‘లేడీ జాకిర్‌ హుసేన్‌’ అనే బిరుదు ఇచ్చాయి. నిజానికి ఇలాంటి బిరుదులు పరోక్షంగా స్త్రీల శక్తిని తక్కువ అంచనా వేసేవే. కాలక్రమంలో అనురాధా పాల్‌ తన పేరుతో తానే ఒక గొప్ప తబలా విద్వాంసకురాలిగా పేరు పొందింది. ఆమె పర్కషనిస్ట్‌ కూడా. అంటే ఒకటికి మించి తోడు వాయిద్యాలను వాయించే వారిని పర్కషనిస్ట్‌ అంటారు. అనురాధా పాల్‌ కనీసం 40 రకాల వాయిద్యాలను వాయించగలదు.

అలా తానే అన్ని వాయిద్యాలు వాయిస్తూ ఆమె ఆల్బమ్‌ చేసింది కూడా. అయితే కొత్తల్లో ఆమెకు అంత సజావుగా ఎంట్రీ దొరకలేదు. ‘‘ఒక కచ్చేరిలో నన్ను కొన్ని తాళాలు మాత్రమే వాయించమన్నారు. దూకుడుగా వాయించాల్సిన తాళాలను మగ తబలా ప్లేయర్‌ వాయిస్తాడని చెప్పారు. కారణం అడిగాను. ‘దూకుడు తాళాల పని నీకు అప్పచెప్తే ఆడపిల్లతో కష్టం చేయిస్తున్నారన్న మాట వస్తుంది’ అని చెప్పారు. నేను అడ్డం తిరుక్కుని మొత్తం వాయించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నాను’’ అంటుంది అనురాధా పాల్‌.

సాధారణంగా కచ్చేరీలలో మగవారు గాత్రంలో ఉంటే మగ సహ వాద్యకారులనే తోడు తీసుకుంటారు. ఆడవాళ్లను ప్రోత్సహించరు. ఆ విషయంలో కూడా అనురాధా పాల్‌ సుదీర్ఘ పోరాటం చేసి పెద్ద పెద్ద గాత్ర విద్వాంసుల తోడు కూచుని కచేరీ చేయగలిగింది.

‘నేను మహిళను. ఈ శక్తి నాది. నా శక్తికి విలువ ఇవ్వండి. నేను మహిళను కాబట్టి నాకు మెచ్చుకోలులో వాటా ఇవ్వకండి’ అంటుంది అనురాధా పాల్‌. ఆమె అందరూ మహిళా విద్వాంసులు ఉండే ‘స్త్రీ శక్తి’ అనే బ్యాండ్‌ను తయారు చేసి ప్రపంచంలో అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే క్లాసికల్‌ను వెస్ట్రన్‌తో జత చేస్తూ ‘రీచార్జ్‌’ అనే బ్యాండ్‌ ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇస్తుంది. తన సోలో ప్రదర్శనలు ప్రత్యేకం.

ఇంత సాధించినా ఆమెకు ‘పద్మశ్రీ’ ఇంకా దక్కలేదు. సంగీత ప్రపంచంలో పురుషుల ప్రాభవం ఇంకా కొనసాగుతున్నదనే అనుకోవాలి. కాని ఎంత కాలం? అనురాధా పాల్‌ లాంటి వాళ్లు మరెందరో పుట్టుకు వచ్చి ఇదంతా కచ్చితంగా మార్చరూ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement