జస్టిస్ హేమ కమిటీ నివేదికలో సంచలనాలు
మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్టుగా వినాలని శాసిస్తున్నారు. ‘ఎస్’ అంటే మేకప్... ‘నో’ అంటే ప్యాకప్ అని బెదిరిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్టుతో కుదుపునకు లోనవుతోంది.
‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది.
రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలను శాసిస్తున్నారని ఈ కమిటీ పేర్కొనడం గమనార్హం.
ఇదీ నేపథ్యం
దాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.
విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న (సోమవారం) మధ్యాహ్నం ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
కమిటీ నివేదికలో సంచలన విషయాలు
‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది.
అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.
ఆ 15 మంది
కొంతమంది హీరోలు... మరికొంతమంది దర్శకులు... ఇంకొందరు నిర్మాతలు... ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది.
ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే
సర్దుకుపోండి... రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు... కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
– ఫణికుమార్ అనంతోజు
కమిటీ సిఫార్సులు
→ సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి.
→ అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మహిళలను న్యాయం చేయాలి.
→ నేరచరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి
→ షూటింగ్ జరిగే ్రపాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలి.
→ ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి.
→ పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment