womens issues
-
మాలీవుడ్ ‘తెర’ వెనుక కన్నీటి చార
మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్టుగా వినాలని శాసిస్తున్నారు. ‘ఎస్’ అంటే మేకప్... ‘నో’ అంటే ప్యాకప్ అని బెదిరిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్టుతో కుదుపునకు లోనవుతోంది.‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలను శాసిస్తున్నారని ఈ కమిటీ పేర్కొనడం గమనార్హం. ఇదీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న (సోమవారం) మధ్యాహ్నం ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.కమిటీ నివేదికలో సంచలన విషయాలు‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.ఆ 15 మందికొంతమంది హీరోలు... మరికొంతమంది దర్శకులు... ఇంకొందరు నిర్మాతలు... ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటేసర్దుకుపోండి... రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు... కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.– ఫణికుమార్ అనంతోజుకమిటీ సిఫార్సులు→ సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి.→ అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మహిళలను న్యాయం చేయాలి.→ నేరచరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి→ షూటింగ్ జరిగే ్రపాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలి.→ ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి.→ పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి. -
పోరాట స్ఫూర్తి
‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ మొదలైంది. చిత్రాభిమానుల విశిష్ట పండగ లో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. మొదటి విశేషం... చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే సగం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మహిళా దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైన బంగ్లాదేశ్ చిత్రం ‘రెహన మరియమ్ నూర్’ మహిళల సమస్యను ప్రతిబింబిస్తుంది. 37 సంవత్సరాల రెహన మెడికల్ కాలేజి ప్రొఫెసర్. ఒక బిడ్డకు తల్లిగా, అమ్మకు కూతురిగా, సోదరుడికి అక్కగా ఆమె వ్యక్తిగత జీవితానికి, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌గా వృత్తి జీవితానికి మధ్య సమన్వయం, వాటి మధ్య తలెత్తే వైరుధ్యాలు, వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది.రెండో విశేషం... ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుర్దిష్ ఫిల్మ్‌మేకర్ లిసా కలన్ను ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ పురస్కారంతో సత్కరిస్తారు. కొన్ని నిజజీవిత కథలు, కల్పన కంటే ఆశ్చర్యపరుస్తాయి. ‘లిసా కలన్’ది అచ్చంగా అలాంటి కథ... ఐసిస్ ఉగ్రవాదుల బాంబుదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకుంది లిసా. అయితే ఆమె పోగొట్టుకుంది కాళ్లు మాత్రమే. ఆమెలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, దూసుకుపోయే తత్వం ఎక్కడికీ పోలేదు. ‘హిడెన్’ అనే సినిమాకు ఆర్ట్‌డైరెక్టర్‌గా వ్యవహరించడంతో పాటు నటించింది. ‘వాయిస్ ఆఫ్ ది స్ట్రీట్’ సినిమాకు సౌండ్ అండ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించింది. ఎన్నిరకాల సృజనాత్మక బాధ్యతలను చేపట్టినా ఆమె నమ్మిన సూత్రం ... బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించాలని. ఇందుకు చిత్రాలను బలమైన ఆయుధంగా ఎంచుకుంది. టర్కీలోని కుర్ద్‌ల కుటుంబంలో పుట్టిన లిసా, బాల్యంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. రాజ్యహింసను దగ్గర నుంచి చూసింది. హైస్కూల్ చదువుతోనే ఆమె చదువు ఆగిపోయింది. దీనికి కారణం...పై చదువులు తన మాతృభాషలో కాకుండా ‘టర్కిష్’లో మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండడం. చదువుకు దూరమైనప్పటికీ ‘అరమ్ టైగ్రన్ సిటీ కన్జర్వేటరీ’లో సినిమా పాఠాలు చదువుకుంది. విస్తృతమైన ప్రపంచాన్ని చూసింది. సినిమా కోర్స్ తన మాతృభాష లోనే ఉండడం ఆమెకు బాగా నచ్చిన విషయం. ఈ చిత్రకళల ఆలయంలో తాను గడిపిన రెండు సంవత్సరాల కాలం విలువైనది. విలువల గురించి తెలుకునేలా చేసింది. ఆ తరువాత... ఊరు, వాడ, పల్లె, పట్లణం అనే తేడా లేకుండా కుర్దుల జీవితాన్ని చూడడానికి తిరిగింది. ముఖ్యంగా కుర్దీష్ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు లిసాను కదిలించాయి. వారి ఆత్మగౌరవ పోరాటం ఆకట్టుకుంది. తాను చూసిన దృశ్యాలను పొలిటికల్ డాక్యుమెంటరీల రూపంలో ప్రపంచానికి చూపింది. మృత్యువు ఎదురొచ్చిన రోజు... జూన్, 2015లో దియర్బకిర్ నగరంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పాల్గొంది లిసా. పార్టీని లక్ష్యంగా చేసుకొని ‘ఐసిస్’ ఉగ్రవాదులు చేసిన బాంబుదాడిలో మృత్యువు అంచుల వరకు వెళ్లింది లిసా. రెండు కాళ్లు పోగొట్టుకుంది. ‘లిసా బతకడం అరుదైనఅదృష్టం’ అన్నారు. మంచమే ఆమె ప్రపంచం అయింది. తాను అమితంగా ప్రేమించిన చిత్రప్రపంచం దూరమైపోయింది. ‘ఇంటిపట్టునే ఉండు తల్లీ ఎందుకొచ్చిన కష్టాలు!’ అన్నవాళ్లతోపాటు– ‘రెండు కాళ్లే పోయినప్పుడు, ఇంట్లో పడుండక ఏమి చేస్తుంది’ అని వెక్కిరించిన వాళ్ళూ ఉన్నారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఆరు సంవత్సరాలు నరకప్రాయంగా గడిచాయి. వేరే వాళ్లలో అయితే జీవన ఆసక్తి అంటూ లేకుండా పోయేదేమోగానీ లిసా మాత్రం మళ్లీ అడుగులు వేసింది. ఈసారి కృత్రిమకాళ్లతో! గతంలోలాగే ఉద్యమాలలో భాగం అయింది. చిత్రాలను తీయడం మొదలు పెట్టింది. ‘ఎందరి జీవితాలనో తెరకెక్కించింది లిసా. నిజానికి ఆమె జీవితమే ఒక అద్భుతమై చిత్రం’ అనే మాట తిరువనంతపురం చిత్రోత్సవంలో నలుమూలలా వినిపిస్తూనే ఉంది. -
అతివలకు అండగా..
సాక్షి, అమరావతి: మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదు కాగా.. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాల వంటి కేసులు 44,780 ఉండటం గమనార్హం. గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మహిళా పోలీస్ టీమ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు కొత్తగా మరిన్ని చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో 18 యూనిట్లలో ఏర్పాటైన శక్తి టీమ్స్ (మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల బృందాలు)ను రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ప్రధానంగా పట్టణాల్లోని విద్యాలయాలు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కాపుకాసే మహిళా పోలీస్ టీమ్‌లు పోకిరిల పనిపట్టనున్నాయి. మహిళలపై దాడులు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఇవి పనిచేస్తాయి. పోలీస్ వలంటీర్లు, మహిళా మిత్రల నియామకం వివిధ సమస్యల బారిన పడుతున్న మహిళలకు అండగా ఉండేలా ప్రత్యేకంగా మహిళా పోలీస్ వలంటీర్లు, మహిళా మిత్రలను ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 18,512 మంది మహిళా పోలీస్ వలంటీర్ల నియామకం, నిర్వహణ కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రస్తుతం విజయవాడలో నేర విచారణ, బాధితుల సంరక్షణ కోసం అంతర్జాతీయ ఫౌండేషన్ సహకారంతో మహిళా పోలీస్ వలంటీర్ల వ్యవస్థ నడుస్తోంది. వారితోపాటు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థినులతో ‘మహిళా మిత్ర’ బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళా చైతన్యానికి, వారికి అండగా నిలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బాలికలు, మహిళల అక్రమ రవాణాకిక చెక్ రాష్ట్రం నలుమూలల నుంచి మహిళల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన స్పందించి వారికి రక్షణ కల్పించేలా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వíßహిస్తున్న హెల్ప్‌లైన్ 181, ఏపీ పోలీస్ హెల్ప్‌లైన్ 100, 1090, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, ఇతర అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ 112 నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల అక్రమ రవాణాను నివారించేలా ఏలూరు, గుంటూరు, అనంతపురంలలో ఉన్న మూడు ప్రత్యేక యూనిట్లకు జవసత్వాలు కల్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచార సాధనాల్లో మహిళలు, బాలికలకు సంబంధించిన అసభ్య పోస్టింగ్‌లు, ట్రోలింగ్లు, కించపరిచే వ్యాఖ్యానాల మూలాలను గుర్తించి అడ్డుకోవడంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం మహిళలు, చిన్నారులపై సైబర్ క్రైమ్ నిరోధానికి నాలుగు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.38.85 లక్షలను బడ్జెట్లో కేటాయించడం విశేషం. -
మహిళల కోసం పోరాటం చేస్తానంటున్న..
మహిళా సమస్యల కోసం పోరాడడానికి సిద్ధమవుతోంది నటి రాధికాఆప్టే. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో రాధికాఆప్టే ఒకరని చెప్పవచ్చు. నటుడు ప్రకాశ్‌రాజ్ నటించి, నిర్మించిన ధోని చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి రాధికాఆప్టే.తొలి చిత్రంలోనే ఒక ధనవంతుడికి ఉంపుడుగత్తెగా నటించి గుర్తింపుపొందారు. అరుుతే ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు.అలాంటి రాధికాఆప్టేకు ఏకంగా సూపర్‌స్టార్‌తో జతకట్టే అవకాశం వరించడం ఎవరూ ఊహించనిదే. అలా కబాలి చిత్రంతో బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఉత్తరాది భామ బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్న సన్నివేశాల్లో నటించడం, అవి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం వంటి అంశాలతో సంచలన నటిగా మారారు. అరుుతే కబాలి చిత్రం తరువాత నటిగా తన స్థారుు మారిపోతుందని ఆశించిన రాధికాఆప్టేకు అలా జరగలేదు. కారణం ఆమె అశ్లీల చిత్రాల ప్రదర్శన కూడా ఒక కారణం కావొచ్చు. హిందీలో ఒకటి, రెండు చిత్రాలు చేస్తున్న రాధికాఆప్టేకు తాజాగా ఒక అవకాశం వచ్చింది. దర్శకుడు మిష్కిన్ శిష్యుడు ఆదిత్య దృష్టిలో పడ్డారు. ఆయన సవరకట్టి అనే చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. సవరకట్టి చిత్రంలో సెలూన్ షాపుల నిర్వాహకులు సమస్యలను తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య ఈ సారి మహిళల సమస్యలను తెరపై ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు.ఇందులో రాధికాఆప్తే మహిళల కోసం పోరాడే విప్లవ భావాలు కలిగిన యువతిగా నటించనున్నారట.అలాంటి పాత్రల్లో రాధికాఆప్టేను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మహిళా సమస్యలపై పోరాడదాం-వైఎస్సార్సీపీ
రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరం ఒక్కటై ముందుకు సాగుదామని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు అమత సాగర్ తెలిపారు. ఆదివారం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల పదవులు పొందిన మహిళా నాయకురాళ్లు పలువురు అమత సాగర్‌ను కలిసి అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో తాను అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వనజా, పుష్పలత, జాయింట్ సెక్రటరీ న్నేహ, రాష్ట్ర కార్యదర్శి సూర్య కుమారి, రాష్ట్ర కార్యాలయ మహిళా విభాగం ఇన్చార్జ్ రాగ సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
మేమున్నామంటూ భరోసా ఇవ్వండి
మహిళా సమస్యల పరిష్కారానికి పునరంకితమవుదాం పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉద్బోధ కమిషనరేట్‌లో తొలిసారి మహిళా దినోత్సవం విజయవాడ సిటీ మహిళా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ తరపున పునరంకితమవుదామని పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తమ శాఖలోని మహిళా అధికారులు, సిబ్బందికి ఉద్బోధించారు. రకరకాల సమస్యలతో వచ్చే మహిళలకు మేమున్నామంటూ భరోసా ఇవ్వాలని సూచించారు. విజయవాడ పోలీసు శాఖ తరపున తొలిసారిగా మంగళవారం ఎ-కన్వెన్షన్ సెంటర్లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్‌లోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సవాంగ్ మాట్లాడుతూ పోలీసు శాఖలో మహిళా సాధికారత దిశగా పలు చర్యలు చేపట్టామన్నారు. కొత్త రాజధానిలో కొత్త సమస్యలు పరిష్కరించాల్సి ఉందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో చెన్నుపాటి విద్యలాంటి వారు చేపట్టే కార్యక్రమాల్లో పోలీసు శాఖ భాగస్వామ్యం ఉంటుందన్నారు. పార్లమెంటు మాజీ సభ్యురాలు చెన్నుపాటి విద్య మాట్లాడుతూ లింగ వివక్షను వ్యతిరేకించే చర్యల్లో భాగంగా మహిళలు తమ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఇటీవల ఉద్యోగాలు, ప్రేమ పేరుతో యువతులు వంచనకు గురవుతున్నట్టు చెప్పారు. ఇవి జరిగిన తర్వాత కాకుండా ముందుగా నిలువరించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దిశగా తాము చేపడుతున్న కార్యక్రమాలకు చేయూత ఇవ్వాలని ఆమె కోరారు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సి.దాస్ మాట్లాడుతూ ఆపదలోని మహిళలు వస్తే స్నేహపూర్వకంగా మాట్లాడి తగిన న్యాయం చేయాలన్నారు. శాంతి భద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళలపై కాళిదాస్ స్వీయ రచన చేసి వినిపించిన కవిత ఆహూతులను ఆకట్టుకుంది. పరిపాలనా విభాగం డీసీపీ జి.వి.జి.అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలదే కీలక భూమిక అన్నారు. కేసుల దర్యాప్తు, మహిళా సమస్యల పరిష్కారంలో మహిళా అధికారుల బాధ్యత, సిబ్బంది పాత్రను గుర్తు చేశారు. పోలీసు శాఖలోని మహిళా సిబ్బందిలో నైపుణ్యం పెంచే కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మహిళల రక్షణ కోసం ఫోర్త్ లయన్ యాప్‌లో ప్రత్యేకంగా ఎస్ఒఎస్ ఆప్షన్ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ వి.వి.నాయుడు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విధుల నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని సత్కరించారు. అదనపు డీసీపీలు, ఏసీపీలు కమిషనరేట్‌లోని అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి వైద్య సేవలు కమిషనరేట్‌లో పని చేసే మహిళా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నాగార్జున ఆస్పత్రి వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500 మంది వరకు మహిళా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని సీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించగా, డీసీపీలు కాళిదాస్, అశోక్ కుమార్, ఏసీపీలు, నాగార్జున హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. షీ ఆటో డ్రైవర్లకు సీపీ భరోసా విజయవాడ సిటీ : నగరంలోని షీ ఆటో డ్రైవర్లు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు కమిషనర్‌ను కలిశారు. కార్పొరేషన్ ప్రాజెక్టు డెరైక్టర్ ఎం.వి.వి.సత్యనారాయణ, ఆటో యూనియన్ నేతలు పట్టాభి, రఘురామ రాజు పాల్గొన్నారు. -
లఘు చిత్రాలుగా మహిళా సమస్యలు
దృశ్య ఆకృతి మన రక్షణ మన చేతుల్లోనే ఉంది. దేశంలోని ప్రతి పాఠశాలలోనూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ విధానాలను కనుక నేర్పిస్తే, మగవాళ్లలో జంకు బయల్దేరుతుంది. అప్పుడీ అత్యాచార ఘటనలు తగ్గుతాయి’’ అంటున్న అకృతి... ఆకృతి నాగ్‌పాల్! నటి, మోడల్. ఇటీవలి బాలీవుడ్ చిత్రం ‘హాలీడే’లో చిన్న పాత్ర. అయితే ఈ పరిచయం అప్పుడే పాతపడిపోయింది. ఆమె ఇప్పుడు ‘డైలీ రేప్’ అనే లఘు చిత్రాన్ని తీసిన నిర్మాత, దర్శకురాలు! ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ గుజరాతీ అమ్మాయి తన కెరీర్‌ను బాలీవుడ్ చిత్రాలకే పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు. లఘుచిత్ర దర్శకురాలిగా మహిళా సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అనుకుంటున్నారు. ‘డైలీ రేప్’ చిత్రంలో ప్రధానంగా ఆమె దాంపత్య జీవితంలోని లైంగిక హింసను చూపించారు. భర్త తన భార్యను అనుక్షణం మాటలతో, చేతలతో ఎలా వేధించేదీ దాపరికం లేకుండా చిత్రీకరించారు. అలాంటివే మరికొన్ని తియ్యాలని ఆకృతి ఉద్దేశం. ‘‘వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట స్త్రీలపై, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. స్త్రీని మగాడు ఒక ఆటవస్తువుగా చూస్తున్న ధోరణి నానాటికీ ఎక్కువవుతోందే కానీ, తగ్గుముఖం పట్టడం లేదు. ఈ ధోరణిని సున్నితంగా ఎత్తిచూపి సమాజంలో ఆలోచన రేకెత్తించాలన్నదే నా ధ్యేయం’’ అంటున్నారు ఆకృతి. అదే సమయంలో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి స్త్రీ సాధికారత ఎంత కీలకమైనదో ఆమె చెప్పదలచుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో, బాధ్యతలను మోయడంలో స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వెయ్యడం వల్లనే సమాజాభివృద్ధి మందగమనంలో సాగుతోందని ఆకృతి బలంగా నమ్ముతున్నారు. మహిళలు పురుషులకంటే ఏవిధంగానూ, ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన బాలీవుడ్ చిత్రాలు.. మదర్ ఇండియా, మిర్చి మసాలా, దామిని, బాండిట్ క్వీన్, లజ్జ, కహానీల నుంచి స్ఫూర్తి పొందిన ఆకృతి అలాంటి చిత్రాలు విరివిగా రావలసిన అవసరం ఉందని అంటున్నారు. నటి, రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన ఆకృతి కొంతకాలంగా ‘ఇండియా ఫర్ ఉమెన్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచే స్తున్నారు. ఆకృతికి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది! ‘‘మన రక్షణ మన చేతుల్లోనే ఉంది. దేశంలోని ప్రతి పాఠశాలలోనూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ విధానాలను కనుక నేర్పిస్తే, మగవాళ్లలో జంకు బయల్దేరుతుంది. అప్పుడీ అత్యాచార ఘటనలు తగ్గుతాయి’’ అంటున్న ఆకృతి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్దాస్ పాంఛోటియా మనవరాలు. విఠల్దాస్ కొన్ని మూకీ చిత్రాలను కూడా తీశారు. తాతగారి అడుగుజాడల్లో నడుస్తున్న ఆకృతి లఘుచిత్రాల అనంతరం కొంత అనుభవం వచ్చాక మహిళా సమస్యలపై ఒక పెద్ద చిత్రాన్నే తీస్తానంటున్నారు. ఆశయం గొప్పది కనుక ఆమె ప్రయత్నం తప్పక ఫలించి తీరుతుంది.