మహిళా సమస్యల పరిష్కారానికి పునరంకితమవుదాం
పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉద్బోధ
కమిషనరేట్‌లో తొలిసారి మహిళా దినోత్సవం
విజయవాడ సిటీ మహిళా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ తరపున పునరంకితమవుదామని పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తమ శాఖలోని మహిళా అధికారులు, సిబ్బందికి ఉద్బోధించారు. రకరకాల సమస్యలతో వచ్చే మహిళలకు మేమున్నామంటూ భరోసా ఇవ్వాలని సూచించారు. విజయవాడ పోలీసు శాఖ తరపున తొలిసారిగా మంగళవారం ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్‌లోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సవాంగ్ మాట్లాడుతూ పోలీసు శాఖలో మహిళా సాధికారత దిశగా పలు చర్యలు చేపట్టామన్నారు. కొత్త రాజధానిలో కొత్త సమస్యలు పరిష్కరించాల్సి ఉందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో చెన్నుపాటి విద్యలాంటి వారు చేపట్టే కార్యక్రమాల్లో పోలీసు శాఖ భాగస్వామ్యం ఉంటుందన్నారు. పార్లమెంటు మాజీ సభ్యురాలు చెన్నుపాటి విద్య మాట్లాడుతూ లింగ వివక్షను వ్యతిరేకించే చర్యల్లో భాగంగా మహిళలు తమ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఇటీవల ఉద్యోగాలు, ప్రేమ పేరుతో యువతులు వంచనకు గురవుతున్నట్టు చెప్పారు.
ఇవి జరిగిన తర్వాత కాకుండా ముందుగా నిలువరించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దిశగా తాము చేపడుతున్న కార్యక్రమాలకు చేయూత ఇవ్వాలని ఆమె కోరారు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సి.దాస్ మాట్లాడుతూ ఆపదలోని మహిళలు వస్తే స్నేహపూర్వకంగా మాట్లాడి తగిన న్యాయం చేయాలన్నారు. శాంతి భద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు.
ఈ సందర్భంగా మహిళలపై కాళిదాస్ స్వీయ రచన చేసి వినిపించిన కవిత ఆహూతులను ఆకట్టుకుంది. పరిపాలనా విభాగం డీసీపీ జి.వి.జి.అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలదే కీలక భూమిక అన్నారు. కేసుల దర్యాప్తు, మహిళా సమస్యల పరిష్కారంలో మహిళా అధికారుల బాధ్యత, సిబ్బంది పాత్రను గుర్తు చేశారు. పోలీసు శాఖలోని మహిళా సిబ్బందిలో నైపుణ్యం పెంచే కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మహిళల రక్షణ కోసం ఫోర్త్ లయన్ యాప్‌లో ప్రత్యేకంగా ఎస్‌ఒఎస్ ఆప్షన్ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ వి.వి.నాయుడు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విధుల నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని సత్కరించారు. అదనపు డీసీపీలు, ఏసీపీలు కమిషనరేట్‌లోని అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీసు సిబ్బందికి వైద్య సేవలు
కమిషనరేట్‌లో పని చేసే మహిళా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నాగార్జున ఆస్పత్రి వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500 మంది వరకు మహిళా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని సీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించగా, డీసీపీలు కాళిదాస్, అశోక్ కుమార్, ఏసీపీలు, నాగార్జున హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు.
షీ ఆటో డ్రైవర్లకు సీపీ భరోసా
విజయవాడ సిటీ : నగరంలోని షీ ఆటో డ్రైవర్లు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు కమిషనర్‌ను కలిశారు. కార్పొరేషన్ ప్రాజెక్టు డెరైక్టర్ ఎం.వి.వి.సత్యనారాయణ, ఆటో యూనియన్ నేతలు పట్టాభి, రఘురామ రాజు పాల్గొన్నారు.
మేమున్నామంటూ భరోసా ఇవ్వండి
Published Wed, Mar 9 2016 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement