రహదారులకు డిసెంబర్‌కల్లా అనుమతులు
కేంద్ర మంత్రులు గడ్కారీ, తోమర్‌లతో తుమ్మల భేటీ
సీఆర్‌ఎఫ్ కింద రూ.400 కోట్లు ఇస్తామన్న గడ్కారీ
న్యూఢిల్లీ: తెలంగాణలో 1,951 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులకు సంబంధించిన అనుమతులను డిసెంబర్ కల్లా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కలసి జాతీయ రహదారులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సమర్పించారు. నివేదికను పరిశీలించి డిసెంబర్ కల్లా అనుమతులిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తుమ్మల చెప్పారు. గతంలో రాష్ట్రానికి సెంట్రల్ కోడ్స్ ఫండ్స్ పథకం కింద నిధులు కూడా తక్కువగా విడుదలైన విషయాన్ని గడ్కారీ దృష్టికి తీసుకెళ్లామని, వీలైనంత త్వరగా సీఆర్‌ఎఫ్ పథకం కింద రూ.800 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని వివరించారు.
దీనికి గడ్కారీ స్పందిస్తూ రూ.400 కోట్లు అందిస్తామని తెలిపినట్లు తుమ్మల చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి పెండింగ్‌లో ఉన్న రూ.1,350 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. తుమ్మల వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగాపాలాచారి, రామచంద్రు తెజావత్, ఎంపీలు వినోద్, ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ తదితరులు ఉన్నారు.
ఆ మూడు జిల్లాలను కలపండి
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తుమ్మల సమావేశమై గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కింద కేవలం ఖమ్మం జిల్లాను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని, రెండో దశలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్‌లను జోడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 3 జిల్లాల్లో రూ.1,590 కోట్లతో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇచ్చేందుకు రూపొందించిన నివేదికను కేంద్రానికి సమర్పించామన్నారు. త్వరలో కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను ఆమోదిస్తామని తోమర్ చెప్పినట్లు తుమ్మల తెలిపారు.