బస్సు ప్రమాదం దురదృష్టకరం: మంత్రి తుమ్మల
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్, ఖమ్మం ఎస్పీ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కాగా, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న ప్రైవేటుబస్సు నాయకన్ గూడెం వద్ద నాగార్జున సాగర్ (ఎన్ఎస్పీ) కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాయకన్ గూడెం రోడ్డు మలుపు వద్ద ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది.
సమాచారం అందుకున్న రిస్య్కూ టీం, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పర్యవేక్షించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్‌ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మూడు 108 వాహనాలలో 18 మంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరొకొంతమందిని పాలేరు, నాయకన్‌గూడెం ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.