కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి | six dies in bus accident in khammam district | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి

Published Mon, Aug 22 2016 6:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్‌ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న యాత్రజినీ ప్రైవేటు బస్సు నాయకన్‌ గూడెం వద్ద నాగార్జున సాగర్‌ (ఎన్ఎస్పీ) కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 10 మంది మృతి చెందగా, 26 మందికి గాయాలయ్యాయి. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నాయకన్‌ గూడెం రోడ్డు మలుపు వద్ద ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందుకున్న రిస్య్కూ టీం, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పర్యవేక్షించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్‌ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకొంతమందిని పాలేరు, నాయకన్‌గూడెం ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నెల్లూరుకు చెందిన జనార్దన్‌ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ అయిన బస్సు నెంబర్‌ ఏపీ26 టీసీ9512 పోలీసులు గుర్తించారు.


బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్టు ఖమ్మం డీఎస్పీ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. మూడు 108 వాహనాలలో 17 మంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని డీఎస్పీ చెప్పారు. బస్సు ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. బస్సు బయటకు తీశాక మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని డీఎస్పీ వెల్లడించారు.

కాగా, ఖమ్మం జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కేసీఆర్‌ తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

మరోవైపు ఏపీలోనూ రెండు చోట్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సు ప్రమాదాలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డుప్రమాదాలపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

బస్సులో ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి..
సత్యనారాయణ (రామచంద్రాపురం), బాలకృష్ణ (ద్రాక్షారామం), ధనలక్ష్మీ (ద్రాక్షారామం), లక్ష్మణ సతీష్ (రాజమండ్రి), అశోక్‌ కుమార్‌, చంద్ర, ప్రశాంత్‌, మోస, లావణ్య, వెంకటేశ్‌, యదిరాజు, మనీ, డీఎస్‌ రావు, లక్ష్మీ, వరలక్ష్మి, సురేష్‌, సత్య, విజయ్‌, లక్ష్మీ, వినయ్‌, సుబ్బారెడ్డి, గణేష్‌, సూరిబాబు, శ్రీను, దుర్గా ప్రసాద్, ఐసి పలువురు ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.


Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement