'రాజకీయాలు చేయడానికి రాలేదు'
హైదరాబాద్ : మానవతా దృక్పధంతో రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది దుర్మరణం చెందగా, మరో 17మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆయన ఆరా తీశారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ....'బస్సు ప్రమాదం ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. గత నెల (జూలై 24న) కూడా ఓ బస్సు నీళ్లలో పడి, ఓ పాప చనిపోయింది. నెలరోజులు కూడా కాకముందే మళ్లీ అదే ప్రాంతంలో ప్రమాదం. ప్రయివేట్ బస్సు సాకుతో ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదు. చికిత్స పొందుతున్న బాధితులు కోలుకోవాలంటే ఇంచుమించు ఆరు నెలలైనా పడుతుంది. ఏరకంగా చూసుకున్నా వాళ్లు బయటకు వెళ్లి పనులు చేసుకోలేని పరిస్థితి. వీరిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం స్పందించాలి. ప్రజలకు ప్రైవేట్ బస్సా? ఇంకో బస్సా అని తెలియదు. ప్రయాణికులు చేసిన తప్పేంటి?. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవటంతో పాటు, గాయపడి చికిత్స పొందుతున్నారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు, చికిత్స పొందుతున్నవారికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మానవతా దృష్ట్యా వారిని ఆదుకోవాలి. ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ అయితే థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ఉంటుంది. ఆ బస్సుకు సంబంధించిన ఇన్సురెన్స్ త్వరగా వచ్చేలా చూడాలి.
నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం లేదు. రాజకీయాలు చేయడానికి రాలేదు. ఎవరినీ తప్పుపట్టదలచుకోలేదు. ప్రమాదం జరిగింది ప్రయివేట్ బస్సు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బాధితులకు తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఘటన జరిగినా వెళ్లడం లేదు. ఆయన రాకున్నప్పటికీ బాధితుల్ని ఆదుకోవాలి.
ఇక ప్రయివేట్ బస్సుల వ్యాపారాలన్నీ టీడీపీ నేతలే చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కూడా విన్నవిస్తున్నా. ఇదే బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కాస్త దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నా' అని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అన్నవిధాలా అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.