మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పక్కన పొంగులేటి, తుమ్మల తదితరులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పదితో పాటు రాష్ట్రంలో 74 నుంచి 78 సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన బీఆర్‌ఎస్ ఒక వైపు, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న కాంగ్రెస్ ఒక వైపు ఎన్నికల బరిలో ఉన్నాయని ఆయన అన్నారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరాక తొలిసారిగా సోమవారం ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగగా.. తుమ్మలకు భట్టితో పాటు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు.
కల్వకుంట్ల కుటుంబం ఆగమాగం
న్యాయం, ధర్మంతో పాటు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు. విజయభేరి సభలో ప్రకటించినట్లుగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్యారంటీ కార్డులో చెప్పినవన్నీ అమలు చేస్తామని అన్నారు. చేవెళ్ల, వరంగల్ డిక్లరేషన్లు, రుణమాఫీ వంటి హామీలు కూడా మేనిఫెస్టోలో చేర్చనున్నామని తెలిపారు. ప్రతి మండలంలో 15 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ పాఠశాలలు నిర్మిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ సభలు, సమావేశాలు, పార్టీ గాలి చూసి కల్వ కుంట్ల కుటుంబం ఆగమాగం అవుతోందని ఎద్దేవా చేశారు. మళ్లీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. పొంగులేటి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. సమావేశంలో తుమ్మలతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment