♦ నేడు సమావేశం కానున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు
♦ సీఎంకు నివేదిక అందజేయనున్న కలెక్టర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : కొత్త జిల్లాపై కసరత్తు ముమ్మరమైంది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు జిల్లా ఎమ్మెల్యేలతో కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ శుక్రవారం సాయంత్రం 3.30 గంటలకు టీటీడీసీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఏర్పాటుతోపాటు డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు, మంత్రి ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. అధికారులు ఇప్పటికే తయారు చేసిన నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసి.. వాటి మార్పుల కోసం సూచనలు చేసే అవకాశం ఉంది. ఈనెల 20న హైదరాబాద్‌లో జరిగే కలెక్టర్ల సమావేశంలో కొత్తగూడెం జిల్లాకు సంబంధించి భౌగోళిక అంశాలతోపాటు ఉద్యోగుల వివరాలు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు గురించి సీఎంకు పూర్తి నివేదికను అందజేయాల్సి ఉంది.
అలాగే రెవెన్యూ డివిజన్లతోపాటు మండలాల ఏర్పాటు గురించి కూడా సమగ్ర నివేదికను అందజేయాలని గతంలో సీఎం సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీటిపై కలెక్టర్ అధికారులతో కసరత్తు పూర్తి చేసి.. నివేదిక తయారు చేశారు. దీనిపై మంత్రి, ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తెలుసుకోనున్నారు. కొత్తగూడెం జిల్లాపై ఎక్కువగా చిక్కులు లేనప్పటికీ.. గార్ల, బయ్యారం మహబూబాబాద్ జిల్లాలో కలుపుతున్నారనే ప్రచారంతో అక్కడి స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అలాగే కారేపల్లి మండలాన్ని వైరా నియోజకవర్గంలోనే ఉంచాలని ఇప్పటికే ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇవి మినహా ఎక్కువగా అభ్యంతరాలు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. మొత్తానికి శుక్రవారం జరిగే సమావేశంతో జిల్లా ఏర్పాటుపై కసరత్తు ఓ కొలిక్కి రానుంది. దీంతో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇచ్చే సూచనలతో తయారు చేసిన నివేదికను కలెక్టర్ సీఎం కేసీఆర్ ముందుంచనున్నారు.