లోకేష్‌లా అడ్డదారిన అధికారంలోకి రాలేదు
కల్లూరు(ఖమ్మం): తెలంగాణలో టీడీపీ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కల్లూరు, టేకులపల్లిలో 220/132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్రానికి ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిని ప్రజలే తరిమికొడతారని చెప్పారు. కేసీఆర్ పిల్లలు లోకేష్ లాగా అడ్డదారిన అధికారంలోకి రాలేదు.. ఉద్యమం చేసి జైళ్లకు పోయి ప్రజాప్రతినిధులుగా గెలిచారని చెప్పారు.
దేశ చరిత్రలో మెనిఫెస్టో అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే.. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా అని నిలదీశారు. కమ్యూనిస్టు ద్రోహి తమ్మినేని వీరభద్రం అంటూ వాళ్ల పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించలేదు.. వీరభద్రం పార్టీ బెంగాల్‌ను ఇరవయ్యేళ్లు పాలించినా ఇంకా జనం రోడ్ల మీదే ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి ద్వారా రూ.75 వేలు కట్నంగా కేసీఆర్ ఇస్తున్నారు అని జగదీష్‌రెడ్డి చెప్పారు.
సత్తుపల్లికి ఏం కావాలన్నా చేస్తా: రాజకీయాలకు పనికి రాని వాళ్ళు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయంటూ రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. భూసేకరణ చట్టానికి వారం రోజుల్లో సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయించారన్నారు.
తనను పాతికేళ్లు తల్లిలా మోసిన సత్తుపల్లి నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్మీనారాయణ, డీసీసీబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.