
సత్తుపల్లి వ్యవసాయ క్షేత్రంలో జూపల్లి, తుమ్మల
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ఖమ్మం: సీఎం కేసీఆర్ పర్యటనకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్ వెంట ఉన్న ఆయన ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతర క్రమంలో బీరం టీఆర్‌ఎస్‌లో చేరడం.. ఆ తర్వాత కేసీఆర్‌కు జూపల్లి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం వనపర్తిలో కేసీఆర్ పర్యటనకు ఆయన డుమ్మా కొట్టడంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
తుమ్మల, పొంగులేటితో భేటీ
సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉండగా జూపల్లి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. తుమ్మల గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. పొంగులేటి ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. అయితే, వీరిద్దరూ టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నా పెద్దగా హడావుడి లేదు. తుమ్మల పూర్తిస్థాయిలో సొంత పనులు చూసుకుంటూ పాలేరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. పొంగులేటి సైతం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.
మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో వీరికి పదవులు దక్కుతాయా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సత్తుపల్లి సమీపంలోని వ్యవసాయక్షేత్రంలో తుమ్మలను జూపల్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూపల్లికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లభించడంలేదనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన తుమ్మలను కలవడం చర్చనీయాంశమైంది. వీరు రాజకీయ భవిష్యత్‌పై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత జూపల్లి ఖమ్మం చేరుకుని పొంగులేటితో సమావేశమయ్యా రు. ఈ భేటీలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, పార్టీ నేత తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment