
హైవేలను అనుసంధానిస్తూ ఓఆర్‌ఆర్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలకు కొత్తగా జాతీయ రహదారులు మంజూరైన నేపథ్యంలో వాటికి మరోవైపు రోడ్ల నిర్మాణం చేపట్టి ఔటర్ రింగు రోడ్లు (ఓఆర్‌ఆర్)గా తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా ప్రధాన పట్టణాలకు రింగు రోడ్లు సమకూరుతాయన్నారు.
రూ.223.35 కోట్లతో చేపడుతున్న గజ్వేల్ రింగు రోడ్డు పనులు మొదలయ్యాయని, రూ.209 కోట్లతో చేపట్టనున్న ఖమ్మం రింగు రోడ్డు డీపీఆర్ సిద్ధమైం దని, రూ.96.70 కోట్లతో చేపట్టనున్న మహబూబ్‌నగర్ రింగురోడ్డు నిర్మాణ సంస్థ ఖరారైందని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు మరోపక్క జాతీయ రహదారితో దీన్ని రింగు రోడ్డుగా మారుస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డికి సంబంధించి జాతీయ రహదారి మినహా శంకర్‌పల్లి–కంది మధ్య రాష్ట్ర నిధులతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. జనగామను కూడా అదే పద్ధతిలో అనుసంధానించనున్నట్లు తెలిపారు.