సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రుణ ప్రణాళికను ఖరారు చేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఇతర రంగాలు సహా మొత్తంగా రూ.2.80 లక్షల కోట్ల రుణాలకు పచ్చజెండా ఊపింది. ఇది గతేడాది రుణ ప్రణాళికతో పోలిస్తే రూ.94 వేల కోట్లు అదనం కావటం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రుణ ప్రణాళికతో కూడిన ఫోకస్ పేపర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకే పెద్దపీట
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి భారీ చేయూతనే లభించే అవకాశం ఉంది. రూ.133587.86 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేయటం విశేషం. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికలో నాబార్డు ఖరారు చేసిన మొత్తం రూ.1,12,762 కోట్లు మాత్రమే కావటం గమనార్హం.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరారైన వ్యవసాయ రుణాల్లో.. పంటల సాగు, మార్కెటింగ్ కోసం రూ.81,478.02 కోట్లు, టర్మ్‌లోన్‌ల కింద రూ.27,664.91 కోట్లు, వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.5197.26 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.19,247.67 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఖరారు చేసింది. ఈ రంగానికి రూ.1,29,635.83 కోట్ల వరకు రుణాల రూపంలో ఇవ్వవచ్చని బ్యాంకర్లకు సూచించింది.
బ్యాంకర్లు మరింత సాయానికి ముందుకు రావాలి: తుమ్మల
దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా బ్యాంకర్లు మరింత ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వ్యవసాయంపై ఫోకస్ చేస్తుండటాన్ని నాబార్డు, బ్యాంకర్లు గుర్తించాలని కోరారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సూచించారు.
ఆ రంగంలో గేదెలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని, కానీ ఆవు పాల వృద్ధిని కోరుకుందామని, దీని వల్ల ఆరోగ్యంతోపాటు, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించినట్టవుతుందని మంత్రి తుమ్మల సూచించారు. పామాయిల్ సాగుకు కూడా మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. వరి సాగు విస్తృతంగా సాగుతోందని, కానీ సంప్రదాయ తృణ ధాన్యాల వృద్ధిపై రైతులు దృష్టిసారించాలని మంత్రి కోరారు.
నాగార్జున గ్రామీణ బ్యాంకు రుణంతోనే నా తొలి నామినేషన్
తనకు వ్యవసాయం రంగం, అందుకు రుణాలిచ్చే గ్రామీణ బ్యాంకులతో మంచి అనుబంధం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను సాగు కోసం నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకునేవాడినని, 1983 తొలి నామినేషన్ కోసం కూడా ఆ బ్యాంకు నుంచే రుణం తీసుకున్నట్టు వెల్లడించారు.
రైతు బంధు నిధులను పెంచుతాం: రఘునందన్‌రావు
రాష్ట్రంలో ప్రతి రెండున్నర వేల మంది రైతులకు ఒకటి చొప్పున ఉన్న రైతు వేదికలను ఆధునికీకరించటం ద్వారా వాటి వినియోగాన్ని పెంచి రైతులకు మరింత ఉపయోగకరంగా మారుస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావు వెల్లడించారు. వాటిల్లో టూ వే ఆడియో విజువల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో క్రాప్ ఇన్‌స్రూెన్స్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతు భరోసా ద్వారా ప్రస్తుతం అందుతున్న రైతు బంధు నిధులను పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వీలైనన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు నాబార్డు తీవ్రంగా కృషి చేస్తోందని, వాటి అవసరాలకు తగ్గట్టుగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ సీజీఎం సుశీల చింతల పేర్కొన్నారు. ఆర్బీ డీజీఎం రాజేంద్రప్రసాద్, ఎస్‌బీఐ జీఎం, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు.
2024–25 సంవత్సరానికి వివిధ రంగాలకు నాబార్డు ఖరారు చేసిన రుణ ప్రణాళిక
వ్యవసాయం, అనుబంధ రంగాల రూ.133587.86 కోట్లు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ. 129635.83 కోట్లు
ఎగుమతుల కోసం రుణాలు రూ. 451.67 కోట్లు
విద్య రూ.2706.50 కోట్లు
గృహనిర్మాణం రూ.10768.58 కోట్లు
పునరుత్పాదక విద్యుత్తు రూ.566.61కోట్లు
ఇతర రంగాలు రూ.2283.51
వ్యవసాయానికి రూ.1.33 లక్షల కోట్ల రుణం
Published Wed, Jan 31 2024 5:09 AM | Last Updated on Wed, Jan 31 2024 5:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment