
సాక్షి, అమరావతి: జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గిపోతోందని, అదే సమయంలో దేశంలో సాగుచేసే వారి సంఖ్య పెరుగుతోందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే, ఇతర దేశాలతో పోలిస్తే వ్యవసాయ కూలీల సంఖ్య దేశంలో ఆశించిన స్థాయిలో తగ్గలేదని, రైతుల ఆదాయం కూడా పెరగడంలేదని ఆ నివేదిక పేర్కొంది. 21వ శతాబ్దంలో.. వ్యవసాయ రంగంలో సవాళ్లు–అనుసరించాల్సిన విధానాలపై నాబార్డు అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది.
నివేదిక ముఖ్యాంశాలు ఇవీ..
► జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 1991లో 27.3 శాతం ఉండగా 2019 నాటికి 16.7 శాతానికి తగ్గిపోయింది.
► అయితే, ఇతర దేశాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఉద్యోగుల సంఖ్య బాగా క్షీణించినప్పటికీ దేశంలో మాత్రం ఆ తగ్గుదల చాలా తక్కువగా ఉంది.
► 1993–94 ఆర్థిక సంవత్సరంలో సాగుచేసే వారి సంఖ్య దేశంలో 138 మిలియన్లుండగా 2019–20 నాటికి 166 మిలియన్లకు పెరిగింది. పురుషులతో పాటు మహిళా సాగుదారుల సంఖ్య కూడా పెరిగింది.
► సాగు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో రైతుల ఆదాయం పెరగడంలేదు. ఈ నేపథ్యంలో.. రైతుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిసారించాలి. వేగవంతమైన రేటుతో రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయోత్పత్తిలో మార్పు అవసరం.
► ఉత్పాదకత పెరుగుదల, సగటు వ్యయం తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరల కల్పించడం, విస్తరణ వంటి బహుముఖ వ్యూహం ద్వారా మార్కెటింగ్ అనుబంధ కార్యకలాపాలను చేపట్టాలి.
► అలాగే.. రైతులను వ్యవసాయేతర వృత్తుల వైపు మార్చడంపైన దృష్టిసారించాలి.
► ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం దేశంలో ఇంకా చాలామంది కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. అయితే, ఇతర దేశాల్లో ఈ రంగంపై ఆధారపడిన కూలీల సంఖ్య బాగా తగ్గింది.
► వ్యవసాయం నుంచి శ్రామిక శక్తిని పారిశ్రామిక రంగం వైపు మళ్లించడంలో ఆ రంగం వైఫల్యాలే కారణం. అందుకే దేశంలో అత్యధిక సంఖ్యలో కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం నుండి తయారీ, సేవల వరకు అవకాశాలను కల్పించేందుకు అన్వేషించాలి.
► వ్యవసాయం, వ్యవసాయేతర ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడంపై ఆలోచన చేయాలి.
సవాళ్లపై దృష్టిపెట్టాలి
ఇక 21వ శతాబ్దంలో వ్యవసాయం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారించడంతో పాటు అవసరమైన సంస్కరణలను తీసుకురావాలని నాబార్డు నివేదిక సూచించింది. అలాగే, కొన్ని దశల్లో వ్యవసాయంలో అధిక వృద్ధిరేటు.. దేశంలో ఆహార పదార్థాల వాస్తవ ధరలను తగ్గించలేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేయడానికి నైపుణ్యం అవసరమని.. ఇందులో భాగంగా, గ్రీన్‌హౌస్ సాగు, పాలీ హౌసెస్, టిష్యూ కల్చర్ విధానాలు అనుసరించడం ద్వారా సగటు వ్యయాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచుతుందని నివేదిక తెలిపింది. ప్రజల ప్రాధాన్యతలను, రైతుల ఆదాయాన్ని పెంచే జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పద్ధతులను అనుసరించాలని వివరించింది.