సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని అధిగ మించి మరీ వ్యవపాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా 2019–20తో పోల్చితే 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీగా 20.75 శాతం మేర వృద్ధి నమోదైనట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఏపీ నుంచి 2020–21లో భారీగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి జరిగినట్లు పేర్కొంది.
గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తరువాత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. కోవిడ్ విసిరిన సవాళ్ల మధ్య కూడా 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక వృద్ధి నమోదు కావటాన్ని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. 2019–20లో దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ.2.53 లక్షల కోట్లు ఉండగా కోవిడ్ మహమ్మారిని అధిగమించి 2020–21లో రూ.3.05 లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి.
పది దేశాలకే అత్యధికం
భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా, చైనా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, సౌదీ ఆరేబియా, ఇండోనేషియా, నేపాల్, ఇరాన్, మలేషియా అది పెద్ద మార్కెట్‌గా నిలిచాయని, మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ దేశాలదే 52.2 శాతం వాటా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2020–21లో దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల వాటా 21.4 శాతంగా ఉంది.
తరువాత సముద్ర ఉత్పత్తులు 14.5 శాతం, సుగంధ ద్రవ్యాలు 9.7 శాతం, గేదె మాంసం 7.7 శాతం, చక్కెర 6.8 శాతంగా ఉంది. ప్రధానంగా ఈ ఐదు ఎగుమతుల వాటా 60.10 శాతంగా ఉన్నట్లు నివేదిక విశ్లేషించింది.
తొలిసారిగా రాష్ట్రానికి 4వ స్థానం
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం 2020–21లో రూ.23,505.2 కోట్ల విలువైన ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. అయితే గత సర్కారు హయాంలో ఏ ఒక్క ఆర్థిక ఏడాదిలోనూ రూ.9,000 కోట్ల మేర కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరగలేదు.
టీడీపీ హయాంలో 2028–19లో ఏపీ నుంచి రూ.8,929.5 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అయినట్లు నివేదిక పేర్కొంది. ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏడు రాష్ట్రాల వాటా 88 శాతం ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment