పెదవాగు ప్రాజెక్టు రీడిజైన్‌ చేస్తాం | Minister Tummala Nageswara Rao Inspects Peddavagu Project | Sakshi
Sakshi News home page

పెదవాగు ప్రాజెక్టు రీడిజైన్‌ చేస్తాం

Published Mon, Jul 22 2024 1:55 AM | Last Updated on Mon, Jul 22 2024 1:55 AM

Minister Tummala Nageswara Rao Inspects Peddavagu Project

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

అశ్వారావుపేట రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టును రీడిజైన్‌ చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన గుమ్మడవల్లి, కొత్తూరు, నారాయణపురంలో పర్యటించి వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధిక వర్షాలు, వరద పోటుతో పెదవాగు ప్రాజెక్టుకు పడిన గండ్లను పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ, పెదవాగు ప్రాజెక్ట్‌కు గండ్లు పడి భారీగా ఆస్తి, పంట నష్టపోవడం బాధాకరమని, ఇందులో ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పెదవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసినా ప్రయోజనం ఉండదని, తిరిగి నిర్మించడమే మంచిదని అన్నారు.

గోదావరి నదీ యాజమాన్య బోర్డు, ఏపీ రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా, అదనంగా మరో మూడు గేట్లు ఏర్పాటుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానాకాలం సీజన్‌ నాటికే ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల వెంట భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఇరిగేషన్‌ సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

దెబ్బతిన్న పార్వతీ బరాజ్‌ కరకట్ట
మరమ్మతు చేపట్టిన నీటిపారుదల శాఖ అధికారులు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపు రం గ్రామ సమీపంలోని పా ర్వతీ బరాజ్‌ కరకట్ట కోతకు గురైంది. అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికా రులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం బరాజ్‌ డెలివరీ సిస్టం వైపు ఉన్న కరకట్ట దెబ్బతినగా మట్టి పోశారు. కానీ, భారీ వర్షాలకు మరోసారి కరకట్ట కోతకు గురైంది. 

అప్పటినుంచి మరమ్మతు చేపట్టలేదు. జాతీయ భద్రత ప్రాధికార సంస్థ ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం బరాజ్‌ మరమ్మతు కొనసాగుతోంది. ఈ క్రమంలో దిగువ గేట్లవైపు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 74 గేట్లను ఎత్తడంతో బరాజ్‌లోని నీరు పూర్తిగా ఖాళీ అయింది. పనిలోపనిగా గతంలో దెబ్బతిన్న కరకట్ట మరమ్మతు కూడా చేస్తున్నారు. 

కరకట్ట కోతకు గురికాకుండా పకడ్బందీగా పనులు..
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోనే కరకట్ట కోతకు గురైనట్లు పలువురు భావించారు. కానీ, బరాజ్‌లోకి పూర్తిస్థాయి నీరు చేరినా...కరకట్ట కోతకు గురికాకుండా పనులు పకడ్బందీగా చేస్తున్నామని డీఈఈ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. కోతకు గురైన ప్రాంతంలో మట్టి తొలగించి కంకర, సిమెంట్, కాంక్రీట్‌తోపాటు దిగువకు జారకుండా సిమెంట్‌ బిళ్లలు అమర్చుతామని ఆయన వివరించారు.

ఏవైనా అనూహ్య పరిస్థితులేర్పడి కరకట్ట ప్రమాదానికి గురైనా దిగువన 130 మీటర్ల లోతు ఉంటుందని, సమీప గ్రామాలకు వరద చేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. కాగా బరాజ్‌లోకి 5,429 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతేమొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement