
ప్రపంచ బ్యాంకు సలహా‘భారం’రూ. 306 కోట్లు
సర్కారు సై అంటే ప్రజల చేతి ‘చమురు’ వదిలినట్లే
ఫ్యూయల్ సెస్ పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు చేసిన ఓ ‘చిన్న’ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సై అంటే తెలంగాణ వాహనదారులపై గుట్టుచప్పుడు కాకుండా సాలీనా రూ.306 కోట్ల భారం పడుతుంది. ప్రసుత్తం ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వారం రోజుల కిందట ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నగరానికి వచ్చి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఆ ప్రతిపాదనపై నిర్ణయం కోసం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదే ‘ఫ్యూయల్ సెస్’ను పెంచే యోచన. ప్రస్తుతం లీటరు డీజిల్/పెట్రోలుపై రూ.1గా ఉన్న సెస్‌ను రూ.2కు పెంచాలనేదే ప్రపంచబ్యాంకు ‘సలహా’.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో పెట్టుబడుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దానికి బాటలు వేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నెట్‌వర్క్ మెరుగ్గా ఉండాలని గుర్తించింది. ఇందుకు దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు పాత సింగిల్ రోడ్లను రెండు వరుసలకు విస్తరించటం, పాడైన రోడ్లను కొత్తగా మార్చటం, అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించటం లాంటివి ఉన్నాయి. ఇవేకాకుండా ప్రధాన రోడ్లను భారీ స్థాయిలో విస్తరించే ఆలోచనలో కూడా ఉంది. ఇది జరగాలంటే ప్రపంచ బ్యాంకు లాంటి విదేశీ సంస్థల నుంచి రుణం పొందాల్సి ఉంటుంది.
అలా రుణం పొందాలంటే తెలంగాణకు ప్రత్యేకంగా ‘రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ తప్పనిసరి. దీన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించే క్రమంలో నగరానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కార్పొరేషన్ సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకునేలా ఉండాలని పేర్కొంది. ఎంత అప్పు కావాలంటే అంత ఇస్తామని, దాని వడ్డీ చెల్లించేందుకు వీలుగా ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవటం కూడా కార్పొరేషన్‌ను అవసరమనే కోణంలో చర్చ ప్రారంభించిన ప్రతినిధులు ఇందుకోసం మార్గాలను కూడా సూచించారు. ఆ కోవలో చెప్పిందే ఈ సెస్ బాగోతం.
లీటరుకు రూపాయి వడ్డించే యోచన!
ప్రస్తుతం లీటరు చమురుకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న సెస్‌లో మూడొంతులు కేంద్ర ప్రభుత్వానికే చేరుతున్నాయి. అలా కాకుండా దాన్ని రూ.2కు పెంచితే అదనంగా వసూలు చేసే రూపాయి వాటా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని, దాన్ని రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదలాయించొచ్చని ఉచిత సలహా ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో వార్షికంగా 290 కోట్ల లీటర్ల డీజిల్ మరో 16 కోట్ల లీటర్ల పెట్రోలు అమ్ముడవుతోంది. అంటే 306 కోట్ల లీటర్ల చమురన్నమాట. దీనిపై రూపాయి చొప్పున సెస్ భారం పడనుంది. అంటే సాలీనా రూ.306 కోట్ల అదనపు భారం పడనుందన్నమాట. ఇది గుట్టుచప్పుడు కాకుండా జరిగే ప్రక్రియ. దాన్ని గుర్తించకుండానే వాహనదారులు ఆ మొత్తాన్ని జేబు నుంచి చెల్లించేస్తారు. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సై అంటే చమురు పోటు తప్పదన్నమాట.