వాహనదారులపై రూ.306 కోట్ల పోటు?
♦ ప్రభుత్వ పరిశీలనలో ఫ్యూయల్ సెస్ పెంపు ప్రతిపాదన
♦ లీటర్‌కు రూపాయి మేర పెంచాలని ప్రపంచ బ్యాంకు సూచన
♦ ప్రతిపాదిత రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నిధుల కోసమే
♦ వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు పొందాలంటే ఈ కార్పొరేషన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు చేసిన ఓ ‘చిన్న’ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సై అంటే వాహనదారుల చేతి చమురు వదలనుంది. వారిపై సాలీనా రూ.306 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ప్రతిపాదిత ‘రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’కు నిధుల కోసం ప్రస్తుతం లీటర్ డీజిల్/పెట్రోల్ విక్రయాలపై రూ.1గా ఉన్న ఫ్యూయల్ సెస్‌ను రూ.2కు పెంచుకోవాలంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వానికి ఇటీవల సూచించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో పెట్టుబడుల కోసం తీవ్రం గా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దానికి బాటలు వేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నెట్‌వర్క్ మెరుగ్గా ఉండాలని గుర్తించింది.
ఇందుకు దాదాపు రూ.10వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టిం ది. ఇందులో కొత్త రోడ్ల నిర్మాణంతోపాటు పాత సింగిల్ రోడ్లను రెండు వరుసలకు విస్తరించటం, పాడైన రోడ్లకు మరమ్మతులు చేయడం, అవసరమై న చోట్ల వంతెనలు నిర్మించటం లాంటివి ఉన్నాయి. ఇవి కాకుండా ప్రధాన రోడ్లను భారీగా విస్తరించే ఆలోచనలో కూడా సర్కారు ఉంది. ఇది జరగాలంటే ప్రపంచ బ్యాంకు లాంటి విదేశీ సంస్థల నుంచి రుణం పొందాలి. ఇందుకు తెలంగాణకు ప్రత్యేకంగా ‘రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ తప్పనిసరి. దీన్ని ఏ ర్పాటు చేసుకోవాలని సూచించేందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులతో గత వారం సమావేశమైన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.. ప్రతిపాదిత కార్పొరేషన్ సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకునేలా ఉండాలని సూచించారు.
ఎంత అప్పు కావాలంటే అంత ఇస్తామని, దాని వడ్డీ చెల్లించేందుకు వీలుగా ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవటం కూడా కార్పొరేషన్‌కు అవసరమనే కోణంలో చర్చ ప్రారంభించిన ప్రతినిధు లు ఇందుకు మార్గాలను కూడా సూచిస్తూ ఈ మేరకు ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం లీటరు చమురుకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న సెస్‌లో మూడొంతులు కేంద్ర ప్రభుత్వానికే చేరుతోంది. అలా కాకుండా దాన్ని రూ.2కు పెంచితే అదనంగా వసూలు చేసే రూపాయి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సలహా ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో వార్షికంగా 290 కోట్ల లీటర్ల డీజిల్, 16 కోట్ల లీటర్ల పెట్రోల్ కలిపి 306 కోట్ల లీటర్ల చమురు అమ్ముడవుతోంది. దీనిపై రూపాయి చొప్పున అదనపు సెస్ విధిస్తే వాహనదారులపై సాలీనా రూ.306 కోట్ల అదనపు భారం పడుతుంది.