
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హైవేలపై రోజు రోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు గురించి నివేదించేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను లాంచ్ చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జియో గ్రాఫిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం పని పూర్తి చేసినట్టు జాతీయ రహదారుల అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసిఎల్) తెలిపింది. ప్రమాద బాధితులకు తక్షణం సహాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. అంతేకాదు త్వరలోనే దీనిపై ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది
బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి, ప్రాణాలను రక్షించే యోచనలో భాగంగా ఈ చర్య తీసుకోవాలని అధారిటీ యోచిస్తోంది. 1033 అనే టోల్ నెంబర్‌ను వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. 1033 హెల్స్‌లైన్ ద్వారా ఎమర్జన్సీ లేదా నాన్ ఎమర్జన్సీ సేవలతో హైవే వినియోగదారులకు "వన్ స్టాప్ పరిష్కారం" అందించనున్నామని భారత జాతీయ రహదారుల అథారిటీ అధ్యక్షుడు దీపక్ కుమార్ వెల్లడించారు. ప్రమాద బాధితులను నిర్ధారించడానికి, సకాలంలో వైద్య చికిత్స అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి లేదా ఏదైనా ఇతర అత్యవసర పరిస్థితి గురించి ఒక కాల్ వచ్చినప్పుడు టోల్ నంబర్ ఆపరేటర్లు ఆ సమాచారాన్ని సమీపంలోని ఆపరేషన్ సెంటర్‌కు చేరవేస్తారు. తద్వారా అంబులెన్స్ , క్రేన్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
కాగా దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30శాతం జాతీయ రహదారులపైనే సంభవిస్తున్నాయి. ముఖ్యంగా 2016 సంవత్సరంలోనే ఈ ప్రమాదాల్లో 52,075 మంది ప్రాణాలు కోల్పోగా, 1.46 లక్షలమంది గాయాలపాలైనట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment