మృతులు పెరిగితేగానీ స్పందించరా?
‘హెల్మెట్’ విషయంలో ఏపీ, తెలంగాణలకు హైకోర్టు చురక
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే అనేకమంది చనిపోతున్నారని, ఇలా మరణించే వారిసంఖ్య గణనీయంగా పెరిగితే తప్ప హెల్మెట్ ధారణ తప్పనిసరి నిబంధనను ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా కనిపించడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నిబంధనలను అమలు చేయలేనప్పుడు వాటిని రద్దుచేయాలని పార్లమెంట్‌ను కోరాలని రెండు ప్రభుత్వాలకు సూచించింది. హెల్మెట్ ధారణ గురించి తాము కొద్ది నెలలుగా పదేపదే చెబుతున్నా ఫలితం కనిపించడం లేదంది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రమే మెరుగ్గా స్పందిస్తోందని, ఏపీ సర్కార్ తమ అంచనాలకు అనుగుణంగా స్పందించడం లేదని వ్యాఖ్యానించింది. రెండువారాలు గడువిస్తే తాము తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని రెండు రాష్ట్రాలు కోరడంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
మా అంచనాల మేరకు ఏపీ స్పందించడం లేదు
హెల్మెట్ ధారణకు సంబంధించి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని ప్రభుత్వం కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ 2009లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ హెల్మెట్ ధరించని వారిపై కేసు పెట్టామన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ కేసులు పెట్టడం ఈ సమస్యకు పరిష్కారం కాదని, నిబంధన అమలు కావాలని స్పష్టం చేసింది. ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ మాట్లాడుతూ తాము వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ‘అవగాహన కల్పిస్తుంటే హెల్మెట్ ఎందుకు ధరించడం లేదు. వారు పెట్టుకోవడం లేదంటే మీ అవగాహన పనిచేయడం లేదనే అర్థం. రోజూ విస్తృత తనిఖీలు చేయండి. భారీ జరిమానాలు విధించండి. అప్పుడైనా పెట్టుకుంటారు.
నిబంధనలను ఉల్లంఘించే వారి లెసైన్సులు రద్దుచేయడం సాధ్యమేనా? ఆ దిశ కూడా ఆలోచించండి..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనిఖీలు చేసి పెద్ద సంఖ్యలో కేసులు పెట్టామని, గత ఏడాది సెప్టెంబర్‌లో 18 వేలు, అక్టోబర్‌లో 19 వేలు, నవంబర్‌లో 22 వేలు నమోదయ్యాయని, దీనిని బట్టి తాము పనిచేస్తున్న విషయం అర్థమవుతోందని సంజీవ్‌కుమార్ నివేదించారు. పోలీసు, రవాణాశాఖలను అనుసంధానించామన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ సర్కార్ స్పందన తమ అంచనాలకు అనుగుణంగా లేదని, ఆ ప్రభుత్వ తీరుపై తాము సంతృప్తికరంగా లేమని పేర్కొంది. హెల్మెట్ లేకుండా ఎంతమంది చనిపోయారని సంజీవ్‌ను ప్రశ్నించింది. 2012 నుంచి ఇప్పటి వరకు 70 మంది చనిపోయారని సంజీవ్ చెప్పగా, మరింతమంది చనిపోతే తప్ప మీరు హెల్మెట్ నిబంధనను అమలు చేసేలా లేరని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.