రోడ్ల పేరుతో ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదు
రాజధాని ప్రాంతంలో రైతులు, పేదలు నిద్రలేకుండా గడుపుతున్నారు
కోర్టులు మాత్రమే న్యాయం చేయగలవు
చివరి వరకు అండగా ఉండి ఇళ్లు, భూములు కాపాడతా
ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే)
మంగళగిరి రాజధాని కోసం ఎక్స్‌ప్రెస్ హైవేలు, రోడ్ల నిర్మాణం పేరుతో వేలాది నివాసాలు, భూములను ప్రభుత్వం ఎప్పుడు లాక్కుంటుందోనని పేదలు, రైతులు నిద్రలేకుండా గడుపుతున్నారని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆవేదన వ్యక్తంచేశారు. తాడేపల్లి కనకదుర్గ వారధి నుంచి ఎన్టీఆర్ కాలనీ అమరావతి కరకట్ట మీదుగా నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంతో ఇళ్లు, భూములు కోల్పోనున్న రైతులు, పేదలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ ఆవేదనను ఎమ్మెల్యే ఆర్కే ముందు వెలిబుచ్చారు. రైతులు పలువురు తమకున్న అరెకర, ఎకరా భూముల్లో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నామని, రోడ్డు నిర్మాణం కోసం భూములు లాక్కుంటే తమ కుటుంబాలు వీథినపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు మహిళలు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, ఇప్పుడు రాజధాని రోడ్ల పేరుతో తమ నివాసాలు ఖాళీ చేయమంటే ఎక్కడకెళ్లి బతకాలని వాపోయారు.
స్పందించిన ఆర్కే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో రైతులు, పేదలను కబళించి వారి రక్తాన్ని పీల్చుకుంటున్నారని దుయ్యబట్టారు. అమరావతి కరకట్టపై ముఖ్యమంత్రి ఉంటున్న అక్రమ అతిథి గృహంతోపాటు బడాబాబులు తమ అనుచరుల అక్రమ నివాసాలను సక్రమ నివాసాలుగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారని, అలాగే సీఎం తన నివాసానికి వెళ్లేందుకుగాను ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం పేదలు, రైతుల నివాసాలు, భూములను లాక్కుంటారా అని ప్రశ్నించారు. రాజధానికి తాము కాని, తమ పార్టీ కాని వ్యతిరేకం కాదని.. ఆ పేరుతో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఆర్కే పునరుద్ఘాటించారు. రైతులు, పేదల కడపులు కొట్టి రోడ్ల నిర్మాణం చేపట్టే బదులు ఇప్పటికే వెంకటపాలెం వద్ద నిర్మాణానికి అనుమతులు పొందిన వంతెనతోపాటు భూములు సేకరించివున్న ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసుకుంటే రాజధాని అమరావతికి ఇంకా సలువుగా ప్రయాణించవచ్చన్నారు. భూములు, ఇళ్లు కోల్పోనున్నవారు ప్రభుత్వానికి ఎంత మొక్కుకున్నా ఉపయోగం లేదని.. న్యాయస్థానాలను ఆశ్రయించి తమ నివాసాలు, భూములు కాపాడుకోవడమొక్కటే మార్గమని ఆర్కే పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేవారు ఇవ్వవచ్చని అందుకు అడ్డు చెప్పబోమని, ఇవ్వనివారు తమతో కలిసి నడిస్తే చివరివరకు పోరాడి వారి భూములు, నివాసాలను కాపాడతామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఉంటున్న అక్రమ అతిథి గృహాన్ని తొలగించే వరకు ఒక్క నివాసం జోలికి వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఆర్కేతోపాటు పార్టీ తాడేపల్లి పట్టణ కన్యీనర్ బుర్రముక్క వేణుగోపాలరెడ్డి, కౌన్సిలర్లు కేలి వెంకటేశ్వరావు, ఓలేటి రృము, రైతులు గాంధి, మేకా వెంకట్రామిరెడ్డి, బండి రామిరెడ్డి, చీడిపూడి లక్షిరెడ్డి, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, బండి వెంకటరెడ్డి, బుర్రముక్క ఆషా, ఉయ్యూరు లక్ష్మీరాజ్యం తదిత రులు ఉన్నారు.