వాయువేగానికి కళ్లెం
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి బెంగళూరులో బయలుదేరే ప్రైవేటు బస్సులు తెల్లారేసరికి హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ఎంత తొందరగా వాహనదారులను గమ్యస్థానానికి చేరిస్తే అంత డిమాండ్ పెరుగుతుందనేది ట్రావెల్స్ నిర్వాహకుల ఆలోచన. ఈ క్రమంలోనే భారీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బెంగళూరు నుంచి వేగంగా వస్తున్న బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమైన దుర్ఘటన ఈ కోవలోదే. అయినా వాహనాలు ఇప్పటికీ రయ్‌మని దూసుకుపోతూనే ఉన్నాయి. ఇక వీటి జోరుకు కళ్లెం పడబోతోంది. వాయువేగంతో దూసుకెళ్లే అలాంటి వాహనాలు ఇక గంటకు గరిష్టంగా 80 కి.మీ.కు మించి వెళ్లకుండా అడ్డుకట్టపడుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ వాహనాల వేగానికి పరిమితి విధిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 2015 అక్టోబరు 1న, ఆ తర్వాత తయారైన వాహనాలు కచ్చితంగా స్పీడ్ గవర్నర్ (వేగాన్ని నియంత్రించే పరికరం) కలిగి ఉండాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డంపర్లు, ట్యాంకర్లు, పాఠశాల బస్సులు, ప్రమాదకర రసాయనాలు, వస్తువులు తరలించే వాహనాలకు మా త్రం ఈ వేగ పరిమితి 60 కి.మీ.గా నిర్ధారించింది. వాహనం తయారీవేళలోనే వేగాన్ని అదుపు చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2015 అక్టోబరు 1 నుంచి రిజిస్టర్ అయిన వాహనాల్లో ఈ స్పీడ్ గవర్నర్ వ్యవస్థ లేకపోతే వాటి యజ మానులు 2016 ఏప్రిల్ 1 నాటికి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
వీటికి మినహాయింపు: స్పీడ్ గవర్నర్ నిబంధన నుంచి ద్వి, మూడుచక్రాల వాహనాలు, ప్రయాణికులు, వారి వస్తువులు తరలించే చక్రాల వాహనాలు (8 మందికి మించని సామర్థ్యం), ఫైర్‌టెండర్స్(ఫైరింజన్లు), అంబులెన్సు లు, పోలీసు వాహనాలను మినహాయించారు.
గందరగోళ నిబంధన: కొన్ని ప్రైవేటు లారీ యజమానుల సంఘాల ప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులు ఇప్పుడు గందరగోళంగా మారాయి. వేగ నియంత్రణ పరికరాన్ని ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి తయారైన వాహనాలకే పరిమితం చేయడంతో... పాత వాహనాలు వేగంగా వెళ్లొచ్చనే సంకేతాలి చ్చినట్లయింది. ప్రమాదాల నియంత్రణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం నీరుగారుతుందనే విమర్శలున్నాయి. ఇప్పటికే రోడ్డు మీద పరుగుపెడుతున్న వాహనాలు అమిత వేగంతో వెళ్లడం, కొత్త వాహనాలు 80 కి.మీ. వేగంతో వెళ్లడం.. వెరసి ఈ నిర్ణయం గందరగోళంగా మారింది.