మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వాలి
వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున సహాయం చేయాలి
- ప్రైవేటు బస్సు ప్రయాణికులని వదిలేయొద్దు
- టీడీపీ నాయకులే ప్రైవేటు బస్సులు నడుపుతున్నారు
- జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని ట్రావెల్స్ బస్సులే ఎక్కువ
- ఖమ్మంజిల్లా బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున చెల్లించి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న బస్సు దారి మధ్యలో ప్రమాదానికి గురై 10 మంది చనిపోవడం, మిగిలిన వాళ్లకు గాయాలు కావడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. అది మా బస్సు కాదు, మాకు సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకోకుండా... ఈ ప్రమాదంలో నష్టపోయిన వారికి, చనిపోయిన ప్రతి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు.
ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు నాయకన్‌గూడెం చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల్లో ఎనిమిదిమంది ఆంధ్రప్రదేశ్, మరో ఇద్దరు తెలంగాణవారున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న వారిని ఓదార్చారు. అందరికీ భరోసానిస్తూ, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్‌రావు, డీసీహెచ్ ఆనందవాణితో చర్చించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి పంపిస్తామని చెప్పారు. అనంతరం మృతదేహాలను సందర్శించారు. తిరిగి 3.30 గంటలకు ఆయన హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు...
నాయకన్‌గూడెం నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వరకు, అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వెళ్లేవరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి బాధితులను పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు, తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణ నిధి, వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చెలమలశెట్టి సునీల్, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు బి.వి.రమణ, కాపా వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తిమ్మలపల్లి భాస్కర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు జిల్లేపల్లి సైదులు, మందడపు వెంకట్రామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, సహాయ కార్యదర్శి బండ్ల సోమిరెడ్డి, కుర్సం సత్యనారాయణ, సంపెట వెంకటేశ్వర్లు, జమలాపరం రామకృష్ణ, అన్నపూర్ణ, దీపక్, ఉదయ్ కుమార్, ఫిరోజ్, మేడిశెట్టి యాదగిరి తదితరులున్నారు.
టీడీపీ నాయకులవే ప్రైవేటు బస్సులు..
ప్రైవేటు బస్సులు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయని, వాటికి రక్షణ లేకుం డా పోవడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని జగన్ ధ్వజమెత్తారు. ఆస్పత్రి ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ప్రైవేటు బస్సుల వ్యాపారాలు చేస్తున్నందువల్లే వాటిని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. తరచూ జరుగుతున్న ప్రమాదాలకు ఇదే కారణమని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నానికి చెందిన ట్రావెల్స్ బస్సులే ఎక్కువగా ఉన్నాయన్నారు.
ఈ విషయంలో తాను రాజకీయాలు చేయదల్చుకోలేదని, మానవతా దృక్పథంతో ఆలోచించి ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని జగన్ విజ్ఞప్తిచేశారు. బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు వచ్చినా, రాకపోయినా ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రుల గాయాలు మానేవరకు వారి కుటుంబాలకు రూ.50 వేలు ఇవ్వాలన్నారు. ప్రైవేటు బస్సులో ప్రయాణించే ప్రతీ వారికి థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుందని, ఈ బస్సుకు సంబంధించిన బీమా త్వరితగతిన ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అదే బ్రిడ్జి వద్ద జూన్ 24వ తేదీన బస్సు ప్రమాదం జరిగి ఒక చిన్నపాప నీళ్లల్లో పడి చనిపోయిన ఘటనను గుర్తుచేశారు. రెండు నెలలు గడవకముందే మరోసారి అదే బ్రిడ్జి వద్ద మరో బస్సు ప్రమాదానికి గురికావడం విచారకరమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, బ్రిడ్జికి మరమ్మతులు చేయించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.