సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ ముందుకు సాగేలా కన్పించడం లేదు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఈ ప్రాజెక్ట్ కింద గ్రామీణ పేదరిక నిర్మూలన ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు రూ.642 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో ప్రభుత్వం తన వాటా కింద రూ.192 కోట్లు ఖర్చు చేయనుండగా, మిగిలిన రూ.450 కోట్లను రుణంగా ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు గత మార్చి నెలలోనే అంగీకారం తెలిపింది.
దీంతో తన వాటా నిధులతో ఏప్రిల్ 1న తెలంగాణ పల్లె ప్రగతి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందుకోసం రూ.30 కోట్లు కేటాయించింది. ప్రపంచబ్యాంక్ ఇచ్చే రుణానికి వార్షిక వడ్డీ రేటుపై కొనసాగుతున్న వివాదం నేటికీ కొలిక్కి రాకపోవడంతో పల్లెప్రగతి ప్రాజెక్ట్ కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రుణానికి చెల్లించాల్సిన వడ్డీరేటుపై ఉన్నతాధికారులు ప్రపంచబ్యాంకు ప్రతి నిధులతో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో 2.75% ఫిక్స్‌డ్ వడ్డీకి అంగీకరించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తాజాగా, తాము పొరపాటు పడ్డామని 3.75% చెల్లిస్తేనే రుణం ఇస్తామని ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.
గతంలో వడ్డీరేటుపై ఒప్పందం జరిగినపుడు ఉన్న అప్పటి పీఆర్ ముఖ్య కార్యదర్శి ఇటీవల రెవెన్యూశాఖకు బదిలీ కావడం, ప్రస్తుత ముఖ్య కార్యదర్శి సెలవులో ఉండడంతో వడ్డీరేటును పునః సమీక్షించడంలో ఇబ్బంది ఏర్పడింది. అంతేకాకుండా వడ్డీరేటు ప్లోటింగ్‌లోనా, ఫిక్స్‌డ్‌గానా.. అనే అంశాన్ని ఖరారు చేయడంలోనూ ప్రభుత్వం తేల్చలేదు. వడ్డీరేటు ఖరారైతేగానీ రుణ కాంట్రాక్ట్‌పై ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుకాదని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో ప్రాజెక్ట్ కొనసాగింపుపై సెర్ప్ అధికారుల్లోనూ డోలాయమాన పరిస్థితులు నెలకొన్నాయి.
‘పల్లెప్రగతి’పై తేలని పంచాయితీ
Published Wed, Nov 11 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM
Advertisement
Advertisement