
ప్రతి ప్రాథమిక పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రం
జూన్‌లోగా చర్యలు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఈ మేరకు జూన్‌లోగా చర్యలు పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. మంగళవారం న్యాక్ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి తుమ్మల సమీక్షించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రం ఉండాలని, ఇందుకు 2 గదులు కేటాయించాలన్నారు. ఇప్పటికే మంజూరై, నిర్మాణాలు పూర్తికాని అంగన్‌వాడీ కేంద్రాలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో నిర్మించా లన్నారు.
అవసరం లేని అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించాలని, ఇందుకు స్థానిక తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆ శాఖ సంచాలకుడు విజయేందిరను ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖలోని ఖాళీలపై నివేదిక ఇవ్వాలని, వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులను తీసుకురావాలని, ఇందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.