రిటైనింగ్ వాల్ కూలడం దురదృష్టకరం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఈ పరిస్థితికి కారణం
నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మంత్రి తుమ్మల, మండలి చైర్మన్ గుత్తాలతో కలిసి సుంకిశాల పంప్‌హౌస్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్/పెద్దవూర: జంటనగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల వద్ద చేపడుతున్న ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువైనా చాలా దురదృష్టకరమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. పనులు పూర్తి కావడానికి రెండు నెలలు ఆలస్యమవుతుందని, ఎంతటి నష్టమైనా కాంట్రాక్టరే భరిస్తాడని, ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును కాంట్రాక్టర్ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. నీట మునిగిన సుంకిశాల పంప్‌హౌస్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. సుంకిశాల ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిజైన్ చేసింది, కాంట్రాక్ట్ ఇచ్చింది. నిర్మాణం చేపట్టింది బీఆర్‌ఎస్ పార్టీనే అని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు మొత్తుకుంటున్నారో అర్థం కావడం లేదని, ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ఈ పనులను ప్రారంభించటంలో మతలబు ఏమిటో వారే చెప్పాలన్నారు. శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందేదని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తీరుతామని చెప్పారు.
సీఎంపై ఆరోపణలు సరికావు : గుత్తా
సుంకిశాల ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యుడని రాజకీయ ఆరోపణలు కేటీఆర్ చేయడం సరికాదని, ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నంత మాత్రాన ఈ ఘటనకు సీఎం బాధ్యుడని అంటే ఎలా అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లోనే ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, ఎవరి కోసం చేపట్టాల్సి వచ్చిందో కేసీఆర్, కేటీఆర్‌లలో ఎవరి మానసపుత్రికనో వారికే తెలియాలన్నారు.
గ్రావిటీ ద్వారా తాగునీరు అందిస్తాం : తుమ్మల
ప్రభుత్వంపై ఎత్తిపోతల భారం లేకుండా మిగిలి పోయిన 9.5 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండజిల్లాకు సాగునీటితో పాటు జంట నగరాలకు గ్రావిటీ ద్వారా తాగునీరు ఇవ్వ టానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వరద ఉధృతి ని ఏజెన్సీ ఊహించకపోవడం, త్వరగా పూర్తి చేయా లన్న తపనో, త్వరగా నీరు ఇవ్వాలన్న తాపత్ర యమో దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందన్నారు. రిపోర్టు రాగానే ఏంచర్యలు తీసుకో వాలి.. బాధ్యులు ఎవరనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సుంకిశాలను సందర్శించిన వారిలో జలమండలి ఎండీ ఆశోక్‌రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీర్ల బృందం కూడా ఉంది.
పునర్నిర్మాణ వ్యయం రూ.20 కోట్లపైనే
రిటైనింగ్ వాల్ నిర్మాణ ఖర్చు భరించేందుకు కాంట్రాక్టర్ సంస్థ అంగీకరించనట్టు తెలి సింది. అయితే ఈ పనులకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం తగ్గిన తర్వాతనే దెబ్బతిన్న భాగాన్ని తిరిగి నిర్మించే అవకాశాలున్నాయి. సుంకిశాల ‘ఘటన’. రిటైనింగ్ వాల్ కూలిన వ్యవహారంలో గోప్యత ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పనుల నాణ్యతపై కూడా ఆరా తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment