
నంబర్ వన్ తెలంగాణే లక్ష్యం
పటాన్‌చెరు నియోజకవర్గంలో శుక్రవారం మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
♦ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
♦ పటాన్‌చెరు నుంచి సంగారెడ్డికి
♦ బైపాస్ రోడ్డు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
పటాన్‌చెరు నియోజకవర్గంలో శుక్రవారం మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంబర్ వన్ తెలంగాణే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
పటాన్‌చెరు టౌన్ : తాను గురువారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటగా మొదక్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. పటాన్‌చెరు పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు పట్టణంలోని చిన్న వాగు వద్ద బ్రిడ్జి, పెద్ద వాగు, రామేశ్వరం బండ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావుకు, మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేశారు.
అనంతరం మంత్రి తుమ్మల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మొత్తంలో 1627 కిలో మీటర్ల మేర ఇప్పటి వరకు రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు.రోడ్డులు, బ్రిడ్‌జల నిర్మాణ పనులను నాణ్యత పాటిస్తూ చేపట్టాలని ఆదేశించారు. నాణ్యత పాటిస్తే నిర్మాణాలు పదికాలాల పాటు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రణాళికలతో ముందుకెళితే మరో మూడు సంవత్సరాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అవుతుందన్నారు.
పటాన్‌చెరు నుంచి సంగారెడ్డికి బైపాస్ రోడ్డు : హరీశ్
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వరకు బైపాస్ రోడ్డు నిర్మించడం వల్ల ట్రాఫిక్ కంట్రోలవుతుందన్నారు. ఇందుకు మంత్రి తుమ్మల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి నుంచి ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేను సంగారెడ్డి వరకు నిర్మించాలన్నారు. దీనివల్ల ట్రాఫిక్ తగుతుంది ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అంతే కాకుండా మండలంలో డబుల్ రోడ్లు, జిల్లాలో ఫోర్‌లేన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు.
గత పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంజూరు కాని నిధులు సీఎం కేసీఆర్ పాలనలో మంజూరయ్యాయని, ఒక్క మొదక్ జిల్లాకే ఈ సంవత్సరం రూ. 1460 కోట్లు నిధులు మంజూరయ్యానన్నారు. బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ ద్వారా రోడ్లు, నీటి శాఖ మంత్రులు శాఖలు కలసి పని చేస్తాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు నియెజికవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు అంజయ్య యాదవ్,ఆదర్శ్‌రెడ్డి, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.