
425 కోట్ల పరికరాలున్నాయ్
రాజీవ్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుల పరిధిలో రూ.425 కోట్ల విలువైన పైపులు, మోటార్లు ప్రాజెక్టు సైట్‌లో
దుమ్ముగూడెం పనులపై హరీశ్
ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై తుమ్మలతో కలసి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాజీవ్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుల పరిధిలో రూ.425 కోట్ల విలువైన పైపులు, మోటార్లు ప్రాజెక్టు సైట్‌లో మూలుగుతున్నాయని, వీటిని వినియోగిస్తూ పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వీటిని వినియోగించుకునేలా డిజైన్లు రూపొందించాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను యుద్ధప్రాతిపదికన రూపొందించాలని నిర్దేశించారు. ఆదివారం రాజీవ్, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టుల సమీకృత పథకం, ఇతర ఎత్తిపోతల పథకాలు, మిషన్ కాకతీయ పనులపై మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు వ్యాప్కోస్ ప్రతినిధి శంభూఆజాద్, ఇతర ఇంజనీర్లతో సమీక్షించారు.
ఈ నెల 28న మరోమారు ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి, ముఖ్యమంత్రి సమక్షంలో తుది నిర్ణయం చేయాలని మంత్రి నిర్ణయించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వల మీద 17 ఎత్తిపోతల పథకాల ఆధునీకరణ కోసం రూ.55 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది మిషన్ కాకతీయ రెండో విడతలో వెయ్యి చెరువులను చేపట్టాలని, మొదటి విడత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇక పులిచింతల ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న ఎత్తిపోతల పథకాలను ఏపీ అధికారులతో కలసి సంయుక్తంగా సర్వే నిర్వహి, వాటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎండీని ఆదేశించారు.
పాలెంవాగు స్పిల్‌వే గేట్లను, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం సైతం మార్చికల్లా పూర్తి చేయాలన్నారు. వచ్చే ఖరీఫ్‌లో పాలెంవాగు కింద 10,200 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోదికుం టవాగు ప్రాజెక్టుకు అవసరమైన 180 ఎకరాల ప్రత్యామ్నాయ అటవీ భూములను వెంటనే గుర్తించి అటవీ శాఖకు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. పాలేరు రిజర్వాయర్ నుంచి మధిరపురం వరకు ఎత్తిపోతల పథకం టెండర్లను పిలవడానికి చర్యలు తీసుకోవాలని, టెండర్ బిడ్ డాక్యుమెంట్‌ను వెంటనే ఆమోదించి ఏడు రోజుల్లో షార్ట్ టెండర్ పిలవాలని ఆదేశించారు.