వచ్చే జూన్ నాటికి ‘దేవాదుల’ పూర్తి చేయాలి
అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. బుధవారం ఆయన ఆయకట్టు అభివృద్ధి సంస్థ (ఐడీసీ) కార్యాలయంలో దేవాదుల, ఎస్సారెస్పీ-2, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై సమీక్షించారు. దేవాదుల కింద మొత్తంగా 10వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా.. 3వేలు పూర్తయిందని, మిగతా సేకరణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులను పూర్తి చేసి నిర్ణీత ఆయకట్టుకు ఖరీఫ్‌లోనే నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి సత్వర ప్రాయోజిత పథకం(ఏఐబీపీ) కింద కేంద్రం చేస్తున్న రూ.300 కోట్ల నిధులను సక్రమంగా వాడుకోవాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్యాకేజీ-1లో చేయాల్సిన మార్పులపైనా అధికారులతో చర్చించారు. అటవీ శాఖ అడ్డంకుల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించి నిర్ణయం చేయాలని సూచిం చినట్లు తెలిసింది.
ఉత్తమ ఇంజనీర్లకు అవార్డుల ప్రదానం
ప్రఖ్యాత ఇంజనీర్ నవాజ్ అలీజంగ్ మెమోరియల్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డులను మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉత్తమ ఇంజనీర్లకు ప్రదానం చేశారు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ రిటైర్డ్ ఈఎన్‌సీ ఎల్‌ఆర్ కపూర్, ట్రాన్స్‌కో రిటైర్డ్ డెరైక్టర్ ఎం.గోపాలచారి, ఆర్‌అండ్‌బీ రిటైర్డ్ సీఈ శాస్త్రిలకు అవార్డులను అందజేశారు. ఇరిగేషన్ శాఖలో సీఈగా పనిచేసిన ఎస్.ప్రభాకర్‌కు ఆయన మరణానంతరం ఈ అవార్డును ఆయన కుటుంబీకులకు అందజేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డిలతో పాటు వివిధ శాఖల ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.