
‘జిల్లాల పునర్విభజనలో పారదర్శకం’
జిల్లాల పునర్విభజనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
హైదరాబాద్: జిల్లాల పునర్విభజనలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం వ్యవహరించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. ఉద్యోగుల విభజనలో సైతం సమస్యలకు తావివ్వకూడదన్నారు. బుధవారం ఆయన మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
10 జిల్లాల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులను 27 జిల్లాలకు విభజించే ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. భవనాల కేటాయింపుపై ఆరా తీసిన మంత్రి భవనాల స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని దసరా నాటికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలోని చిన్నారుల దత్తతకు సంబంధించి అపరిషృ్కత అంశాలపై కేంద్ర మంత్రి మేనకా గాంధీకి నివేదిక పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.