తుమ్మల ఫొటోతో ఉన్న జెండాతో పాటు కాంగ్రెస్ జెండా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజల ఆత్మగౌరవం..అవసరం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా.. మీ అండ, బలగం ఉన్నంత కాలం దేనికీ తలవంచను.. నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉంది.’అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్‌ఎస్ ఇటీవల అసెంబ్లీ టికెట్ల జాబితా ప్రకటించగా, తుమ్మలకు స్థానం దక్కలేదు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆయన శుక్రవారం తొలిసారి జిల్లాకు వచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల అనుచరులు వెయ్యికి పైగా కార్లు, ఇతర వాహనాల్లో వచ్చినాయకన్‌గూడెం వద్ద తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఖమ్మంలోని గొల్లగూడెంలో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు పదవి అలంకారం, అహంకారం, ఆధిపత్యం కోసం కాదని ప్రజల కళ్లలో చిరునవ్వు చూడటం కోసమేనని చెప్పారు.
గత ఎన్నికల సందర్భంగా గోదావరి జలాలతో జిల్లా ప్రజల కాళ్లు కడిగి రాజకీయాల నుంచి విరమిస్తానని సీఎం కేసీఆర్‌కు చెప్పానని, అది నెరవేరాకే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. ప్రస్తు తం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా.. ప్రజల ఆరాటం, అభిమానం చూశాక తనకు అవసరం లేకపోయినా.. జిల్లా కోసం, ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పాలేరు, వైరా, లంకాసాగర్, ఉభయ జిల్లాల్లోని రిజర్వాయర్లను నింపి రాజకీ యాల నుంచి విరమిస్తానని తుమ్మల వెల్లడించారు.
తుమ్మల ఫొటోతో ప్రత్యేక జెండాలు
ర్యాలీలో ప్రతీ వాహనానికి ప్రత్యేకంగా తుమ్మల ఫొటో ఉన్న తెల్లరంగు జెండాలు కట్టారు. ఎక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కానీ బీఆర్‌ఎస్ జెండాలు కానీ కనిపించలేదు. కొందరు తుమ్మల ఫొటో ఉన్న జెండాలతో పాటు కాంగ్రెస్ జెండాలు కూడా పట్టుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment