
రూ.15 వేల కోట్లతో రోడ్ల ఆధునీకరణ: తుమ్మల
హైదరాబాద్: రాష్ర్టంలో మరో మూడేళ్లలో రూ.15 వేల కోట్లు వెచ్చించి ఆర్ అండ్ బి రహదారులను ఆధునీకరిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తా నుంచి బాచుపల్లి వరకు రూ.15 కోట్లతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులకు ఆయన రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలసి ఆదివారం శంకుస్థాపన చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, విడతలవారీగా రహదారుల పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు మధ్యలో డివైడర్లు, వీధిలైట్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.