
దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలి
పాలేరులో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు గెలిచే సత్తా ఉంటే మంత్రి పదవికి,
తుమ్మలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: పాలేరులో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు గెలిచే సత్తా ఉంటే మంత్రి పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేసి ఎన్నికల బరిలో నిలవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవాల్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన ఎన్‌ఎస్‌యూఐ శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయడం ద్వారా తనకు మానవత్వం, రాజకీయ విలువలు, ప్రజాస్వామిక సంప్రదాయాలంటే గౌరవం లేదని నిరూపించుకుందన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, పేదలకోసం పనిచేసిన రాంరెడ్డి వెంకట రెడ్డి మరణిస్తే ఆయన కుటుంబసభ్యులకు ఏకగ్రీవం ఇవ్వడానికి టీఆర్‌ఎస్ ఒప్పుకోకపోవడం అత్యంత బాధాకరమన్నారు. పాలేరులో కాంగ్రెస్ గెలుపుకోసం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు గ్రామగ్రామాన తిరగాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ కుప్పకూలి పోయిందన్నారు. యూనివర్సిటీలకు మెస్‌బిల్లులు లేవని, కాలేజీలకు ఫీజులు రీయింబర్సుమెంటు చేయడం లేదన్నారు. వీటికోసం అడిగిన విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో వేధిస్తున్నదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనలతో విద్యకు పేదలు దూరమవుతున్నారని ఆరోపించారు. హెచ్‌సీయూలో దళితవిద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం సంతాపాన్ని కూడా వ్యక్తం చేయలేదన్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్, జాతీయ ప్రధానకార్యదర్శి వర్ధన్, నేతలు విపిన్, అమీర్ జావేద్ పాల్గొన్నారు.
రాష్ట్ర సమస్యలపై పోరాటం: నేరెళ్ల శారద
రాష్ట్రంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా రాజకీయ ఫిరాయింపులతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులతోనే కాలం గడుపుతున్నదని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం గాంధీభవన్‌లో మంగళవారం జరిగింది. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతున్నదన్నారు. ఏ ఒక్క హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. టీపీసీసీ మహిళా నేతలు కె.ఉమారాణి, నాగమణి, ధనలక్ష్మి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.