
'నేడు, రేపు వీఐపీలు భద్రాచలం రావొద్దు'
ఖమ్మం : గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. దాంతో పట్టణంలోని అన్నీ పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో నేడు, రేపు భద్రాచలం రావొద్దని వీఐపీలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం భద్రాచలంలో పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితి పర్యవేక్షించారు.
అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి వంతెనపైకి భక్తులు కాలినడకన రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది... వాటిలో ప్రయాణించాలని భక్తులను కోరారు. అధిక రద్దీ నేపథ్యంతో బూర్గంపహాడ్, మోతె. చిన్నరాయిగూడెం ఘాట్లకు వెళ్లాలని భక్తులకు సూచించారు. అలాగే అధికారులు చేసే సూచనలు పాటించాలని భక్తులను కోరారు.