ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీలో అభివాదం చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఇతర పార్టీల కంటే ముందే ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. ఒకరొకరుగా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. తమ అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొందరు అసంతృప్తులు రహస్య భేటీలతో పార్టీ, అభ్యర్థులపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకొందరు పార్టీలో ఉంటామంటూనే అభ్యర్థులను మాత్రం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ దక్కించుకున్న నేతలతో సయోధ్య కుదుర్చుకునేందుకు అసమ్మతి నేతలు ససేమిరా అంటుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
బీఆర్‌ఎస్ జెండా లేకుండా భారీ ర్యాలీగా
పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాయబారానికి మెత్తబడిన సూచనలు కనిపించడం లేదు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు రెండు రోజుల క్రితం తుమ్మలను కలసి కేసీఆర్ సందేశాన్ని అందించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన తుమ్మలకు.. ఆయన అనుచరులు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద భారీ స్థాయిలో స్వాగతం పలికారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఎక్కడా బీఆర్‌ఎస్ జెండా కనిపించలేదు. తాను ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయకూడదనుకున్నా.. ప్రజల స్పందన చూసి మనసు మార్చుకుంటున్నట్టు తుమ్మల ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరేదీ వెల్లడించలేదు.
నేడు అనుచరులతో మైనంపల్లి భేటీ
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శనివారం హైదరాబాద్ శివార్లలోని దూలపల్లిలో ఉన్న తన నివాసంలో అనుచరులతో భేటీ అవుతున్నట్టు ప్రకటించారు. తన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంపై ఆగ్రహించిన మైనంపల్లి.. మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కఠిన చర్యలు ఉంటాయని బీఆర్‌ఎస్ వర్గాలు ప్రకటించాయి. కేసీఆర్ ఏ తరహా నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలలేదు. మరోవైపు మైనంపల్లి పార్టీని వీడే పక్షంలో ప్రత్యామ్నాయంగా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఆకుల రాజేందర్ తదితరుల పేర్లు బీఆర్‌ఎస్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
ప్రగతి భవన్‌కు నేతల క్యూ
బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రగతిభవన్‌కు క్యూకట్టారు. జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. వేములవాడ టికెట్‌ను వేరేవారికి ప్రకటించిన నేపథ్యంలో చెన్నమనేని రమేశ్‌కు మరో రూపంలో అవకాశమిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రమేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ రంగ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమిస్తున్నట్టుగా ప్రకటన వెలువడింది. అనంతరం రమేశ్ నివాసానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ వెళ్లి మాట్లాడారు.
► ఇక టికెట్ల కేటాయింపులో జనగామ, నర్సాపూర్‌లలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి శుక్రవారం మరోమారు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు.
► మరోవైపు బెల్లంపల్లి టికెట్‌ను తిరిగి దక్కించుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం అకస్మాత్తుగా తన కార్యకలాపాలను రద్దు చేసుకుని ప్రగతిభవన్‌కు రావడం చర్చనీయాంశమైంది.
► టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి నేత నల్ల మనోహర్‌రెడ్డి ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు. కోదాడ అసమ్మతి నేతలు శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
► రామగుండం, ఎల్‌బీనగర్, నాగార్జునసాగర్, పటాన్‌చెరు, మధిర, దేవరకొండ తదితర నియోజకవర్గాల్లోనూ అసమ్మతి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంకా పార్టీ నేతలకు అందుబాటులోకి రావడం లేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment