రైతులు అధైర్యపడొద్దు.. ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి
బీమా ప్రీమియం బాధ్యత మాదే: తుమ్మల
ఖమ్మం వన్‌టౌన్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో రైతులు అధైర్య పడొద్దని.. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ పూర్తిచేసి.. ఎంత మంది రైతులకు, ఎన్ని కోట్ల రుణమాఫీ చేశామనేది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో చెబుతామని తెలిపారు. కాగా, రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగేలా పంటల బీమా పథ కాన్ని అమలు చేస్తూ, ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి చెప్పారు. ఇక విత్తన కంపెనీలతో ఇబ్బందులు లేకుండా రైతులకు విత్తనాలు అందేలా ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుందన్నారు.
కాగా, ఆయిల్‌పామ్‌తో లాభాలు గడించే అవకాశమున్నందున రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఇక పంట నష్టపరిహారం సైతం త్వరలో అందిస్తామని, వచ్చే ఖరీఫ్ నుంచి పెంచిన ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసా పంపిణీ ప్రారంభిస్తామని తుమ్మల తెలిపారు. కాగా, నల్లగొండలో ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజార్టీ ఇస్తామని అక్కడి నేతలు చెబుతున్నందున, ఆ మెజార్టీ దాటేలా ఖమ్మం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment