రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ది కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11న తొలిసారిగా సమావేశం కానున్నది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ది కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11న తొలిసారిగా సమావేశం కానున్నది. వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఉప సంఘం సభ్యులు, మంత్రులు కె.తారకరామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు పాల్గొంటారు.
ఈ సమావేశానికి రావాల్సిందిగా చిత్ర నిర్మాతలు, దర్శకులు, థియేటర్ యజమానులు, పంపిణీదారులు, ఫిల్మ్ చాంబర్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్, టెలివిజన్ రంగానికి చెందిన ప్రతినిధులకు ఆహ్వానాలు వెళ్లాయి. వీరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి చలనచిత్ర రంగానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. రాష్ట్రంలో సినిమా రంగ సమస్యలపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.