మంత్రి తుమ్మల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా? అని మాజీ సీఎం కేసీఆర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అథోగతికి మీరు కారణం కాదా? అని ప్రశ్నించారు.
కేవలం రైతుబంధు పేరిట మిగతా విత్తన సబ్సిడీ, ఇన్‌పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలన్నీ ఎత్తేసి రైతుల్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ఏనాడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఒక్క రైతునైనా ఆదుకున్నారా? అని నిలదీశారు. కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన రూ.10,000 అయినా నష్టపోయిన రైతులందరికి ఇచ్చారా? కేవలం మెదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసి, రెండో విడతగా ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు జీవో ఇచ్చి డబ్బు విడుదల చేయలేదని గుర్తు చేశారు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ కాదా? అని తుమ్మల నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment