ఐసీడీఎస్‌లో అక్రమాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చర్యలు ప్రారంభించారు.
► సూపర్‌వైజర్ల అక్రమ వసూళ్లకు కళ్లెం
► వాట్సప్తో హాజరు శాతం పర్యవేక్షించాలి
► మంత్రి ఆదేశాలతో అక్రమార్కుల్లో అలజడి
ఆర్మూర్: ఐసీడీఎస్‌లో అక్రమాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చర్యలు ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సూపర్‌వైజర్లు, సెక్టార్ లీడర్లు కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంతో పాటు శాఖలో చోటు చేసుకున్న అవినీతిని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయాలని శాఖ రాష్ట్రస్థాయి అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో స్త్రీ శిశు సంక్షేమశాఖ పని తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్‌లో ఉన్న అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. అంతే కాకుండా జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాల జియో ట్యాగింగ్ చేయడంతో పాటు వాటి ఫొటోలు, హాజరు పట్టికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇందుకోసం వాట్సప్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. సూపర్‌వైజర్లు, సెక్టార్ లీడర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడకుండా తరచూ ఆకస్మిక తనిఖీలను సైతం నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలు వెలువడగానే మంత్రి సూచించిన మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమార్కులకు చెక్ పెట్టడానికి ఐసీడీఎస్ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.