![ongress leader Ponguleti met Tummala - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/3/sitarama%20p.jpg.webp?itok=6IgS-GO3)
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల విడుదలను కళ్లారా చూశాకే రాజకీయాల నుంచి విరమిస్తానని... ఆ కోరిక నెరవేర్చుకునేందుకే ఎన్నికల్లో నిలబడుతున్నానని , ప్రజల కోరిక మేరకే నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి తుమ్మలను ఖమ్మంలోని ఆయన స్వగృహంలో కలిశారు.
అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ హోదాలో పొంగులేటి తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారన్నారు. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక అధికారికంగా నీళ్లు వదిలి అదే వేదికపై అందరికీ ధన్యవాదాలు తెలిపి రాజకీయాల నుంచి విరమించాలనేది తన జీవిత కోరిక అని వ్యాఖ్యానించారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.
బీఆర్‌ఎస్ పతనం మొదలైంది: శ్రీనివాసరెడ్డి
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పతనం మొదలైందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి, రెండు శాతం ఓట్లు కూడా లేని సమయాన కేసీఆర్ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో చేరి జిల్లాను అభివృద్ధి పథాన నడిపించారని చెప్పారు. అయితే, బీఆర్‌ఎస్‌లో కొన్ని శక్తులు ఆయ న్ను అవమానాలు, అవహేళనలకు గురిచేసి బయటకు వెళ్లేలా చేశాయన్నారు. కాంగ్రెస్ పక్షాన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment