
దయనీయంగా రైతుల పరిస్థితి
► కాంగ్రెస్ సభపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలు సరికావు
► సీఎల్‌పీ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి
ఖమ్మం: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఎల్‌పీ ఉపనాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలేరులో జరిగిన సభ కాంగ్రెస్ ఆవేదనసభ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం సరికాదన్నారు. మద్దతు ధర రాక రైతులు ఆందోళన చెందుతున్నారని, నాలుగో విడత రుణమాఫీ రాకపోవడంతో బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, జిల్లాలో ఇప్పటి వరకు 60 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సెంట్రల్ ఇంటిలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్న మంత్రి తుమ్మల రైతులు ఆనందంగా ఉన్నారని ఎక్కడ చెప్పిం చినా ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. రైతు బడ్జెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షు డు అయితం సత్యం, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బండి మణి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌నాయుడు, మైనారిటీ సెల్ నాయకులు ఎం.డి.పజల్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.